
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను ఓ జర్నలిస్ట్ అమాంతం కిందపడేశాడు. ఓ లైవ్ షోలోనే ప్రజలంతా చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. యోగా గురువు పహిల్వాన్ అవతారం ఎత్తగా… ఓ సాధారణ జర్నలిస్ట్ ఆయన భరతం పట్టాడు. స్టేజ్ పైనే కుస్తీపడి బాబాను చిత్తుచేశాడు.
భారత్ సంవాద్ అనే పేరుతో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ లైవ్ షో నిర్వహించింది. ఇందులో యోగా గురువు రాందేవ్ పాల్గొన్నారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక జర్నలిస్టును రాందేవ్ కుస్తీ కోసం స్టేజీపైకి పిలిచారు. ఇలా మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన జయదీప్ కర్ణిక్ అనే జర్నలిస్ట్ రాందేవ్‌తో తలపడ్డాడు.
అయితే రాందేవ్ తో జర్నలిస్ట్ లైవ్ కుస్తీకి సంబంధించిన 18 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జయదీప్ కర్ణిక్‌కు కుస్తీలో అనుభవం ఉందని తెలియకుండానే బాబా రాందేవ్ అతనితో పోటీకి దిగాడు. కానీ జయదీప్ ఏమాత్రం తగ్గకుండా రాందేవ్‌ను కిందపడేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు.
వీడియోలో జర్నలిస్ట్ బాబా రాందేవ్‌ను కిందపడేయడం, ఆ తర్వాత రాందేవ్ కావాలనే వదిలేశానని చెప్పడం కనిపిస్తుంది. ఈ ఘటన వైరల్ అవ్వడంతో యోగా గురు తాను సరదా కోసమే అలా చేశానని స్పందించారు. పోటీ మధ్యలో ఒక దశలో రాందేవ్ జయదీప్‌ను కింద పడేసినా, వెంటనే జయదీప్ పైచేయి సాధించి గట్టిగా బదులివ్వడంతో బాబా రాందేవ్ వెనక్కి తగ్గిన దృశ్యం కూడా వీడియోలో ఉంది.