Tiruchirappalli: తమిళనాడులో శ్రీరంగం ఆలయంలో భక్తులు, సెక్యూరిటీ మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత దారితీసింది. తిరుచ్చిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులను సెక్యూరిటీ గార్డులు చితకబాదడంతో రచ్చ మొదలైంది.
Ayyappa Devotees: కలియుగ వైకుంఠ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని తలచుకుంటూ 'గోవిందా గోవిందా..' అంటూ నామస్మరణలు చేసిన భక్తులపై తమిళనాడులోని ఆలయ సెక్యూరిటీ దాడి చేసింది. దీంతో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుచ్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా దాడి చేయడమేంటని భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తులపై ఆలయ గార్డులు దాడి చేయడంతో తిరుచ్చిలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో గందరగోళం నెలకొంది. భక్తులు, కేరళలోని శబరిమల చేరుకోవడానికి ముందు తమిళనాడు అంతటా ప్రయాణించే తీర్థయాత్రలో, తిరుచ్చి శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. గర్భగుడి దగ్గర నిలబడిన భక్తులు వేంకటేశ్వర స్వామికి సంబంధించిన సంప్రదాయ మంత్రమైన 'గోవిందా' అని జపించడంతో సందడి మొదలైంది.
'గోవిందా గోవిందా..' అనే జపం ఆపాలని సెక్యూరిటీ గార్డులు సూచించడంతో ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు అయ్యప్ప భక్తులు గాయపడగా, ఒక యాత్రికుడు రక్తస్రావమై ఆలయం నేలపై కూర్చున్నాడు. పరిస్థితిని గమనించిన ఇతర అయ్యప్ప భక్తులు గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయనీ, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది హిందూ మత-ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్ అండ్ సీఈ) అహంకారమని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై పేర్కోన్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా బీజేపీ తమిళనాడు తిరుచ్చి జిల్లా యూనిట్ ఈరోజు శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇదే సమయంలో ఆలయ పవిత్రతను పాడుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్ అండ్ సీఈ డిపార్ట్‌మెంట్ డిమాండ్ చేస్తోంది.