లోక సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణ.. బంగ్లా ఖాళీ చేయాలని హౌసింగ్ కమిటీ ఆదేశం..

By Sairam Indur  |  First Published Dec 12, 2023, 2:13 PM IST

క్యాష్ ఫర్ క్వైరీ కేసులో లోక సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా (Trinamool Congress MP Mahua Moitra)ను అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని  పార్లమెంట్ హౌసింగ్ కమిటీ (Parliament's Housing Committee) ఆదేశించింది. లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఆమెను దోషిగా తేల్చిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. 


Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీలో కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయించాలని పార్లమెంట్ హౌసింగ్ కమిటీ  గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. 'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఆమెను దోషిగా తేల్చిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. 

ఎథిక్స్ కమిటీ నివేదికను లోక సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న టీఎంసీ ఎంపీ బహిష్కరణకు గురయ్యారు. ఓ వ్యాపారవేత్త నుంచి ఆమె బహుమతులు స్వీకరించడం, అక్రమంగా లబ్ది పొందడం పార్లమెంటరీ ప్రవర్తనను ఉల్లంఘించడమేనని నివేదికలో పేర్కొంది. బీజేపీకి చెందిన నిషికాంత్ దూబే ఫిర్యాదు మేరకు ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి మొయిత్రా అనైతికంగా ప్రవర్తించారని ఆరోపించింది. 

Latest Videos

లోక్ సభ వెబ్ సైట్ లాగిన్ వివరాలను అనధికార వ్యక్తులతో పంచుకున్నారని కమిటీ నివేదిక నొక్కి చెప్పింది. అయితే ఈ వివాదం జాతీయ భద్రతా చిక్కుల గురించి ఆందోళనలను లేవనెత్తింది. వ్యాపారవేత్త ప్రోద్బలంతోనే పార్లమెంటులో అదానీ గ్రూప్ ను, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు లేవనెత్తినందుకు బదులుగా మొయిత్రా బహుమతులు స్వీకరించారని దూబే ఆరోపించారు.

కాగా.. తన బహిష్కరణపై స్పందించిన మొయిత్రా.. లోక్ సభ నిర్ణయం నిర్ణయం చట్టవిరుద్ధమని అన్నారు. పార్లమెంటరీ ప్యానెల్ చర్యలను ఖండిస్తూ ఆమె సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కమిటీని అస్త్రంగా వాడుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆమె విమర్శించారు.

బహిష్కరణను కంగారూ కోర్టులో విచారణతో పోలుస్తూ, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటరీ సంస్థలను ప్రభుత్వం వాడుకుంటోందని మొయిత్రా తన బహిరంగ ప్రకటనల్లో ఆరోపించారు. టీఎంసీకి చెందిన మ‌హువా  మోయిత్రా పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. లోక సభ ఎన్నికలకు ముందు ఆమెపై బహిష్కరణకు గురికావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 
 

click me!