న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో 21, 22, 23వ తేదీల్లో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ట్రస్టు సభ్యులు శుక్రవారం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని చెప్పారు.
రామ మందిరం ట్రస్టు జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ న్యూస్ ఏజెన్సీ పీటీఐతో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. 21, 22, 23వ తేదీలను ఇందుకు ఖరారు చేశాం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తాం. పలువురు సాధువులు, ఇతర ప్రతినిధులనూ ఆహ్వానిస్తాం’ అని చంపత్ రాయ్ వివరించారు.
‘ఈ ప్రధాన కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆసక్తి చూపే వివిధ రాజకీయ పార్టీల నుంచి అతిథులను ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమంలో ఏ వేదికా ఉండదు. ఎలాంటి బహిరంగ సభ కూడా ఉండదు’ అని తెలిపారు.
136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది నాయకులను ఆహ్వానించాలని యోచిస్తున్నట్టు ట్రస్టు తెలిపింది. ఆహ్వానించాలనుకుంటున్న అలాంటి సాధువుల జాబితా తయారు చేస్తున్నామని, అది పూర్తయ్యాక ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో ఆహ్వాన లేఖ పంపిస్తామని వివరించింది. ప్రముఖ సాధువులనందరినీ అయోధ్యలోని పెద్ద పెద్ద మఠాల్లో ఆతిథ్యం ఇస్తామని పేర్కొంది. ఈ 25వేల మంది కాకుండా మరో 10 వేల మంది ప్రత్యేక అతిథులు ఉంటారని చెప్పింది.
Also Read: జ్ఞాన్‌వాపి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. నాన్-ఇన్వాసివ్ సర్వేకు అనుమతి..
రామ్ లల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి కావొచ్చిందని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. జనవరిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత సాధారణ భక్తులు రామ మందిరంలో పూజలు చేసుకోవచ్చని గతంలో మహంత్ నృత్యగోపాల్ దాస్ తెలిపిన సంగతి తెలిసిందే.
2020 ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం పరిమిత స్థాయిలోనే నిర్వహించారు. ఇప్పుడు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జనవరి నెల మొత్తం 75 వేల నుంచి ఒక లక్ష మంది వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్టు నిర్వహించనుంది.