
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలాంటి తవ్వకాలు లేకుండా.. నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వే పూర్తి చేస్తామని ఏఎస్‌ఐ స్పష్టం చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ సర్వేలో తాము ఎలాంటి తవ్వకాలు జరపడం లేదని, గోడ తదితర భాగాలను తాకబోమని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ఐ అఫిడవిట్‌ను గమనించారని కోర్టు పేర్కొంది. ఈ తరుణంలో సర్వేను ‘నాన్-ఇన్వేసివ్ టెక్నిక్’లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు.. 17వ శతాబ్ది నాటి మసీదులో వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపారు. అయితే హిందూ ఆలయం స్థానంలో ఈ కట్టడాన్ని నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించాలని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో మసీదు ప్రాంగణంలో సర్వే కొనసాగించుకోవడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందం జ్ఞానవాపి క్యాంపస్‌లో సర్వే ప్రారంభించింది. జ్ఞాన్వాపిలో సర్వే దృష్ట్యా జిల్లాలోని పోలీసు, పరిపాలన శాఖ అప్రమత్తమైంది. జ్ఞాన్వాపీ క్యాంపస్ దగ్గర పోలీసులు కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు.
ముస్లిం పక్షం పిటిషన్ ఏమిటి?
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సవాల్ చేస్తూ..సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా .. జ్ఞాన్‌వాపి మసీదులో ASI సర్వే చరిత్రలోకి వెళ్లాలని ఉద్దేశించిందని, గత గాయాలను మళ్లీ తెరుస్తుందని ముస్లిం బాడీ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ కోర్టుకు తెలిపింది. మసీదు నిర్వహణ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదిస్తూ.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేసే సర్వే.. చరిత్రను త్రవ్వడం, ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడం, లౌకికవాదం, సోదరభావాన్ని ప్రభావితం చేయడం లాంటిదని వాదించారు.
ఈ విషయాలకు సంబంధించి.. జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లిం పక్షం యొక్క SLP అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయబడింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఏఎస్‌ఐ సర్వేలో సమస్య ఏంటని ముస్లిం పక్షాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేయలేదని, నిర్మాణాలను ధ్వంసం చేయబోమని వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. దీంతో జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేను కొనసాగించవచ్చని పేర్కొంది. కానీ, ‘నాన్-ఇన్వేసివ్’ పద్ధతిలో సర్వే జరగాలని ధర్మాసనం ఆదేశించింది.