Exclusive : అయోధ్య రామమందిర నిర్మాణం.. భారతీయ నాగరికతకు పునరుజ్జీవనం : పుల్లెల గోపీచంద్

Siva Kodati |  
Published : Jan 23, 2024, 10:20 PM ISTUpdated : Jan 23, 2024, 10:22 PM IST
Exclusive : అయోధ్య రామమందిర నిర్మాణం.. భారతీయ నాగరికతకు పునరుజ్జీవనం : పుల్లెల గోపీచంద్

సారాంశం

500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మన రాముడికి ఇంత పెద్ద గుడి కట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ . అయోధ్యలో రామమందిర నిర్మాణం భారతీయ నాగరికతకు పునరుజ్జీవనానికి ప్రతీక అన్నారు.   

500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మన రాముడికి ఇంత పెద్ద గుడి కట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట నేపథ్యంలో ఆయన ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రాముడు మన చరిత్రకు, వారసత్వానికి ప్రతీక అని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని గోపీచంద్ సూచించారు. రాముడి జీవితమంతా కష్టాలే వున్నాయని, ఆ తర్వాత కూడా ఆయన అయోధ్యలో టెంట్‌కు పరిమితమైపోయారని ఇన్నాళ్లకు దాని నుంచి రాముడికి విముక్తి లభించిందన్నారు. రానున్న రోజుల్లో అయోధ్య క్షేత్రం మరింత విస్తరిస్తుందని గోపీచంద్ ఆకాంక్షించారు. 

ప్రధాని మోడీ భారతీయ నాగరికత గొప్పదనాన్ని గుర్తుచేస్తున్నారని, రాముడు దేవుడిలా కాకుండా సాధారణ మనిషిలా ప్రజలకు సేవ చేశారని ఆయన తెలిపారు. రాజుగా, తండ్రిగా, కొడుగ్గా, ఒక వీరుడిగా రాముడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. మన పూర్వీకులు నిజంగా గొప్పవారని, వారిని అణగదొక్కినా, ఎన్నిసార్లు మందిరం ధ్వంసమైనా రాముడి ఆలయాన్ని పునర్నిర్మిస్తూ వచ్చారని గోపీచంద్ ప్రశంసించారు.

రాముడి ఆలయం కోసం ఓ చిన్న సమూహం ఏళ్లుగా పోరాడుతూనే వచ్చిందన్నారు. వారందరికీ ఈ అయోధ్య ఆలయం ఓ గౌరవ సూచిక అన్నారు. బాబర్ నుంచి బ్రిటీషర్ల వరకు ఎంతో మందికి ఎదురుతిరిగి ఆలయాన్ని కాపాడుకున్నారని గోపీచంద్ పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మమని దీనిని నాశనం చేసేవారు వుండరన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం భారతీయ నాగరికతకు పునరుజ్జీవనానికి ప్రతీక అన్నారు. 

ఈ తరం నిజంగా ఎంతో అదృష్టవంతులని, వారందరికీ అయోధ్య రామమందిరాన్ని చూసే భాగ్యం దక్కిందన్నారు. మన చరిత్రను మరోసారి గుర్తుచేసుకోవాలని, ఈ ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యమని పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. ప్రజల మనసుల్లో రాముడు వుంటే అప్పుడే రామరాజ్యం వచ్చినట్లని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేవలం రోడ్లు , బిల్డింగ్‌లు కట్టుకుంటే రామరాజ్యం వచ్చినట్లు కాదని గోపీచంద్ వ్యాఖ్యానించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu