జనవరి 22న అయోధ్య రామమందిరంలో ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం! హాజరుకానున్న ప్రధాని మోడీ

By Mahesh K  |  First Published Sep 26, 2023, 7:00 PM IST

అయోధ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. పూజలు, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జనవరి 14 వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
 


న్యూఢిల్లీ: అయోధ్యలో మూడంతస్తుల భారీ రామ మందిరాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌లోపు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి కానుంది. ఈ తరుణంలోనే వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మందిరాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే రోజున ప్రాణ ప్రతిష్ట చేసే అవకాశాలు ఉన్నాయి. పీటీఐతో ఇంటర్వ్యూలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా మంగళవారం తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా ఖరారు చేయాల్సి ఉన్నదని వివరించారు.

ఏషియానెట్ న్యూస్ నుంచి రాజేశ్ కల్రా ఈ నెలలోనే ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూలో నృపేంద్ర మిశ్రా రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన గురించి వివరించిన సంగతి తెలిసిందే. జనవరి 14వ తేదీ నుంచి 24వ తేదీ నడుమ ఈ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ఏషియానెట్ న్యూస్‌కు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

Latest Videos

Also Read: Asianet News Exclusive: అయోధ్య రాముడి విగ్రహాన్ని ఇలా ఎంపిక చేస్తాం: ఆలయ నిర్మాణ పర్యవేక్షకుడు నృపేంద్ర మిశ్రా

‘ప్రార్థనలు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 2024 జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఈ పూజలు, కార్యక్రమాలు అదే నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించాం. అటు వైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించిన తేదీలో తుది ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం. మరుసటి రోజు నుంచి భక్తులు దర్శనానికి రావొచ్చు. ఆ రాముడి విగ్రహం ముందే ప్రస్తుత భగవంతుడి విగ్రహాన్నీ ఉంచుతాం’ అని అప్పుడు నృపేంద్ర మిశ్రా ఏషియానెట్ న్యూస్‌కు వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య  రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టకు రానున్న తరుణంలో అయోధ్యలో భద్రతను పెంచినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. ఈ కాలంలో భక్తులు అయోధ్యకు రాకుండా ఫిబ్రవరిలో వారి పర్యటనలు పెట్టుకోవడం మంచిదని సూచించారు.

Also Read: ఆయోధ్య రామ మందిరం ప్రజల అచంచల విశ్వాసం, అంకితభావానికి నిదర్శనం.. ఏసియానెట్ న్యూస్ ప్ర‌త్యేక ఇంటర్వ్యూ

జనవరి 22వ తేదీన భారీ మొత్తంలో భక్తులు అయోధ్యకు వస్తారని ఆలయ నిర్మాణ కమిటీ అంచనా వేస్తున్నది. ప్రజలు వారి ఇంటి వద్దే, వారి గ్రామాల్లోనే టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్‌లలో ఈ కార్యాన్ని వీక్షించడం మంచిదని సూచిస్తున్నది.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపుతామని తెలిపింది. 

Also Read: ఆయోధ్య రామ మందిరం గర్భగుడి లోప‌ల ఎలా ఉందంటే..? ఏసియానెట్ న్యూస్ ప్ర‌త్యేక ఇంటర్వ్యూ..

జనవరి 14న మకర సంక్రాంతి తర్వాతి నుంచి పది రోజులపాటు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలని టెంపుల్ ట్రస్ట్ నిర్ణయించింది.

click me!