Independence Day: పెద్ద సమూహాలు వద్దు.. కరోనా ప్రొటోకాల్ పాటించండి: రాష్ట్రాలకు కేంద్రం

By Mahesh KFirst Published Aug 12, 2022, 2:05 PM IST
Highlights

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా కేసులు ఇంకా తగ్గుబాటు పట్టకపోవడంతో ఈ వేడుకలకు పెద్ద పెద్ద సమూహాలుగా గుమిగూడవద్దని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొంత ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కొన్ని రోజుల నుంచి సగటున 15 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కోసారి 12 వేలుగా మరోసారి సుమారు 20 వేల వరకు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మరో వైపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నది. మరికొన్ని రోజుల్లోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కరోనా కేసులు నిలకడగా రిపోర్ట్ అవుతున్న సందర్భంలో ఈ జాగ్రత్తలు చెప్పడం గమనార్హం.

ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెద్ద సమూహాలు లేకుండా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఈ వేడుకలో పాల్గొనడానికి ఏకకాలంలో పెద్ద స్థాయిలో జనాలు పోగుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించింది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ పాటించేలా చూసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.

అలాగే, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని ఓ కీలక ప్రాంతాన్ని స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్‌కు ఎంచుకోవాలని వివరించింది. అక్కడ పక్షం రోజులు లేదా మాసం పాటు స్వచ్ఛ క్యాంపెయిన్‌ను స్వచ్ఛందంగా పౌరులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. 

అదే విధంగా కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తలుగా పెద్ద పెద్ద సమూహాలను నివారించాలని తెలిపింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలని వివరించింది.

శుక్రవారం నాటి వివరాల ప్రకారం, దేశంలో కొత్తగా 16,561 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4,42,23,557 కేసులకు చేరాయి. కాగా, యాక్టివ్ కేసులు 1,23,535 కేసులుగా ఉన్నాయి. కాగా, కొత్తగా ఈ మహమ్మారి కారణంగా 49 మంది మరణించారు.

click me!