
ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా తప్పకుండా మారుస్తానని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మరో సారి స్పష్టం చేశారు. తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే ఇచ్చిన మాటను తాను మర్చిపోలేదని చెప్పారు. తాను ఆ పని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ‘‘ హిందుత్వం మన ప్రతి శ్వాసలోనూ ఉంది.. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మారుస్తామని నా దివంగత తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే హామీ ఇచ్చిన విషయాన్ని నేను ఎన్నడూ మరచిపోలేదు.. మేము దానిని మారుస్తాము ’’ అని ఆయన అన్నారు.
దివంగత శివసేన నాయకుడు బాలాసాహెబ్ గతంలో ఇచ్చిన వాగ్దానం కావడంతో ఔరంగాబాద్ పేరును మార్చాలని సీఎంపై బీజేపీ ఒత్తిడి తెస్తోంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమికి మహావికాస్ అఘాడీ అనే పేరును నిర్ణయించారు. ఈ కూటమికి శివసేననే నాయకత్వం వహిస్తుంది. అయితే ప్రస్తుతం పేరు మార్పు అంశం ప్రభుత్వం చేతిలో ఉన్నా.. కాంగ్రెస్, ఎన్సీపీల భాగస్వామ్య పక్షాలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో వెనక్కి తగ్గుతోంది.
మాస్కు ధరించకుంటే ఫ్లైట్ నుంచి దింపేయడమే.. ఎయిర్‌పోర్టులోనూ పటిష్ట నిఘా
ఔరంగాబాద్ లో బుధవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న సీఎం ఉద్దవ్ ఠాక్రే.. గత కొన్ని వారాలుగా వలస కార్మికులు, కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్న కాశ్మీర్ లో హనుమాన్ చాలీసా పఠించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ‘‘మీకు ధైర్యం ఉంటే వెళ్లి కశ్మీర్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి’’ అని తెలిపారు. హిందుత్వ కోసం శివసేన ఏమి చేసిందో, బీజేపీ ఏమి చేసిందనే దానిపై ముంబైలో బహిరంగ చర్చ జరగాలని ఠాక్రే అభిప్రాయపడ్డారు.
మహమ్మద్ ప్రవక్త పై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, తరువాత జరిగిన పరిణామాలపై కూడా సీఎం మాట్లాడారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకటన కారణంగా దేశం అవమానాన్ని భరించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ లౌడ్ స్పీకర్లు, ఇతర విషయాలపై సమస్యలను సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఎంవీఏ (మహా వికాస్ అఘాడీ) సంకీర్ణం కొందరి కలలకు వ్యతిరేకంగా 2.5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుందని సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. బీజేపీపై విమర్శలు చేశారు.
మహారాష్ట్రలో పరిస్థితులు సరిగ్గా లేవని నిరూపించడానికి కాషాయ పార్టీ నాయకులు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సీఎం ఠాక్రే బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఈడీ, సీబీఐలు తమ వెంట నడిచేలా చేసే బదులు జమ్మూకశ్మీర్ లోని కశ్మీరీ పండిట్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని సూచించారు.‘శివలింగం’పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని థాక్రే చెప్పారు. కాగా ఈ నెల ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రతి మసీదులో ‘శివలింగం’ కోసం చూడవలసిన అవసరం లేదని చెప్పారు. మంగళూరు వంటి కొన్ని చోట్ల మసీదులను సర్వే చేయాలని కోరుతూ న్యాయస్థానాల్లో వరుస పిటిషన్లు దాఖలైన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.