
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో, విమానంలో కరోనా నిబంధనల అమలును కచ్చితత్వంతో అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషణ్ (డీజీసీఏ) తాజాగా గైడ్‌లైన్స్ విడుదల చేసింది. విమానంలో మాస్కు ధరించకుండా వాదనకు దిగితే.. అవసరమైతే.. ఆ ప్రయాణికుడిని టేకాఫ్ కాకముందే దింపేయాలని డీజీసీఏ ఆదేశించింది. విమానం ప్రయాణిస్తుండగా కరోనా నిబంధనలు పాటించకుండా అభ్యంతరకరంగా వ్యవహరిస్తే ఆ ప్రయాణికుడిని అన్‌రూలీ ప్యాసింజర్‌గా పేర్కొనాలని తెలిపింది.
కరోనా నిబంధనలు పాటించాలని తరుచూ సూచించినా.. హెచ్చరించినా ఖాతరు చేయకపోతే విమానం డిపార్చరర్ కాకముందే అవసరమైతే ఆ ప్రయాణికుడిని ఫ్లైట్ నుంచి దింపేయాలని ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ ఆదేశించింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత మాస్కు ధరించకుండా, లేదా ఇతర కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిని అన్‌రూలీ ప్యాసింజర్‌గా పేర్కొనాలని తెలిపింది.
ప్రయాణికులు మాస్కు ధరించేలా చూసే బాధ్యత సీఐఎస్ఎఫ్ సిబ్బందిదేనని డీజీసీఏ వెల్లడించింది. అలాగే, ఎయిర్‌పోర్టు అధికారులు నిఘా పెంచాలని, కరోనా నిబంధనలను ప్రయాణికులు పాటిస్తున్నారా? లేదా? అనేది ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపింది. మాస్కు ధరించడాన్ని వ్యతిరేకించేవారికి జరిమానాలు విధించాలని వివరించింది. లేదా అలాంటి ప్రయాణికులను సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించాలని సూచించింది. వారు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని వివరించింది.
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. స్వల్ప మొత్తంలో అయినా కేసులు నమోదు అవుతున్నాయి. ఏ క్షణంలోనైనా పరిస్థితులు గంభీరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిర్‌పోర్టుల్లో, విమానాల్లో తప్పకుండా మాస్క్ ధరించే నిబంధనను కచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని తెలిపింది. కానీ, నిబంధనలు మాత్రం అమలు చేయాలని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ (ఏసీజే) విపిన్ సింగ్ సారథ్యంలోని బెంచ్ చెప్పింది. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిని అవసరమైతే.. బలవంతంగానైనా విమానం నుంచి దింపేయాలని ఆదేశించింది.
ఎయిర్‌పోర్టు, విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అనే నిబంధన అమల్లోనే ఉన్నదని డీజీసీఏ కౌన్సెల్ కోర్టులో వివరించింది. అయితే, భోజనం చేసేటప్పుడు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉన్నదని తెలిపింది.
విమానాలు, విమానాశ్రయాల్లో మాస్క్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం డీజీసీఏ వేర్వేరుగా నిబంధనలు రూపొందించాలని తెలిపింది. ప్రయాణికులు, ఇతరులు మాస్క్ ధరించడం, ఇతర పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకునేలా గైడ్‌లైన్స్ రిలీజ్ చేయాలని వివరించింది. అలాంటి ప్రయాణికులపై కేసు నమోదు చేయాలని, జరిమానా విధించాలని, నో ఫ్లై లిస్ట్‌లోనూ చేర్చాలని పేర్కొంది.
ఫ్లైట్స్, ఎయిర్‌పోర్టుల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ రోజు కరోనావైరస్ కొత్త కేసులు 5000 మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే.