
గుజరాత్ లో నవ్‌సారి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు అయిన అనంత్ పటేల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి భారీ ఎత్తున జనం ఒక్క చోట గుమిగూడారు. నిరసనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు ఓ దుకాణానికి నిప్పంటించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్ కూడా వారు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలు చేశారు. వీధుల్లోనే తిరిగారు. దాడికి కారణం అయిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024 ఎన్నికలు కాదు.. భారత్ ను ఏకతాటిపైకి తీసుకురావడమే 'భారత్ జోడో యాత్ర' లక్ష్యం: రాహుల్ గాంధీ
అసలేం జరిగిందంటే..?
నవ్‌సారి జిల్లాలోని ఖేర్గాం పట్టణంలో శనివారం రోజున కాంగ్రెస్ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు అనంత్ పటేల్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇందులో ఎమ్మెల్యే తలకు గాయమైంది.
డ్యామ్ లో తేలిన ముగ్గురు మహిళల మృతదేహాలు..
అయితే ఈ దాడిని ఆ జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, అతడి అనుచరులు చేశారని ఎమ్మెల్యే అనంత్ పటేల్ ఆరోపించారు. ‘‘ నేను మీటింగ్ కోసం ఖేర్గాంకు వెళ్లాను. ఆ సమయంలో జిల్లా పంచాయితీ చీఫ్, ఆయన గూండాలు నా కారును ధ్వంసం చేసి నన్ను కొట్టారు. ఆ సమయంలో వారు నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఆదివాసి కావడం వల్ల నాయకుడిగా మారుతున్నారు. మేము మిమ్మల్ని విడిచిపెట్టము.. ఒక ఆదివాసీని ఇక్కడ నడవనివ్వను’ అని నాతో అన్నారు. ఈ దాడికి కారణమైన వారు పట్టుబడే వరకు నిరసన తెలియజేస్తాం ’’ అని ఎమ్మెల్యే అన్నారు.
ఈ ఘటనకు కారణం అయిన వారిని పట్టుకునేంత వరకు ఆదివాసీలు 14 జిల్లాల రహదారులను దిగ్బంధించి నిరసనలు తెలియజేస్తారని ఎమ్మెల్యే అనంత్ పటేల్ హెచ్చరించారు. ‘బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా గళం విప్పితే వారిని కొట్టి, జైలుకు పంపిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.