
ముంబాయి మహీమ్ బీచ్ (maheem beach) ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఇద్దరు దంపతులపై కొంత మంది వ్యక్తులు విచక్షణ రహితంగా పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో 21 ఏళ్ల భర్త మృతి చెందగా.. 19 ఏళ్ల భార్య తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతుడిని మహ్మద్ వసీం షేక్ (mahammad vasheem shaik)గా గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసు తెలిపిన ప్రకారం.. ఇద్దరు దంపతులు బుధవారం దర్గాను దర్శించారు. అనంతరం వారిద్దరు అర్ధరాత్రి 1 గంటలకు వరకు చౌపతీ వద్ద కూర్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి వారితో మాట్లాడారు. కొంత సమయంలో తరువాత పదునైన ఆయుధాలతో వారిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో భార్య వెంటనే ఓ ట్యాక్సిని తీసుకొచ్చి భాభా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే మహ్మద్ వసీం పరిస్థితి విషమించి మృతి చెందాడు.
మహిళలకు కూడా తీవ్రగాయాలు అయినప్పటికీ ఆమె ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను బుధవారం సాయంత్రం సియోన్ హాస్పిటల్ కు తరలించారు. ‘‘ మహిళ మెడపై ఆమె శరీరంలోని ఇతర భాగాలపై గాయాలు ఉన్నాయి. భాభా ఆసుపత్రిలోని అధికారులు ఆమెను విచారించారు. తరువాత పోలీసులకు సమాచారం అందించారు. కొంత సమయం తరువాత ఓ పోలీసు బృందం ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడి నుంచి మహ్మద్ షేక్ వసీం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.” అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
బాధితులు ఇద్దరూ గోవండిలోని శివాజీ నగర్ నివాసితులని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాత కక్షలు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందుతులను వెతుకుతున్న అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. “మహిళ మెడపై గాయాలు ఉన్నాయి. దీంతో ఘటన ఎలా జరిగిందో ? దానికి కారణాలేంటో అనే వివరాలు తెలిపేందుకు ఆమె ఇబ్బంది పడుతోంది. దాడి చేసిన వారు లైంగిక దాడికి ప్రయత్నించారని, కానీ పరీక్షల్లో వాటి ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అందుకే తాము ఇప్పటి వరకు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించలేదు. ’’ అని అన్నారు.
నిందితుల ఆచూకీ కోసం క్రైం బ్రాంచ్ అధికారులతో పాటు మహిం పోలీసులు సీసీటీవీ (cctv) ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో మొత్తం చీకటిగా ఉంది. దీంతో సీసీ కెమెరాల్లో ఎలాంటి దృష్యాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఘటన జరిగిన ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈ ఘటనపై మహిమ్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్య), 307 (హత్యా ప్రయత్నం) 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేశారు. నిందితులు కోసం గాలిస్తున్నారు.