జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. పుల్వామా జిల్లా రాజ్ పోరా ప్రాంతాంలో నేటి మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
జమ్మూకాశ్మీర్ లో దారుణం జరిగింది. యూపీకి చెందిన ఓ వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. పుల్వామా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజ్ పోరా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ముఖేష్ సింగ్ అనే కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.
పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన ముఖేష్ అనే కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత అతడు మరణించాడని కశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించారు. తమ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయని, త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు ‘ఎక్స్’ పోస్టు ద్వారా వెల్లడించారు.
కాగా. పోలీసులు ఘటనా స్థలం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో కశ్మీర్ లోయలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం శ్రీనగర్ లోని ఈద్గా మైదానంలో స్థానికులతో క్రికెట్ ఆడుతున్న ఓ పోలీసు అధికారిపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ఇన్ స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వనీ అనే అధికారి మూడు బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనలపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. కేంద్రం చెబుతున్నట్లుగా లోయలో పరిస్థితులు సాధారణంగా లేవని స్పష్టం చేశారు. పరిస్థితి సాధారణంగా ఉంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ‘‘నిన్న శ్రీనగర్ లో ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ ను కాల్చి చంపారు, ఈ రోజు పుల్వామాలో ఏదో జరిగిందని విన్నాను. కొద్ది రోజుల క్రితం ఎల్జీ ఇక్కడికి వచ్చారు. ప్రజలు ఇళ్లకే తాళం వేసి ఉంచారు. బయటకు వచ్చి తిరగలేని పరిస్థితి నెలకొంది. నేను సీఎం హోదాలో ఇక్కడికి వచ్చేవాడినని, కానీ ఎప్పుడూ నగరాన్ని మూసివేయలేదని. మేము వీధుల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలను వారి ఇళ్లలో బంధించలేదు. ఇది ఎలాంటి సాధారణ పరిస్థితి?’’ అని అబ్దుల్లా ప్రశ్నించారు.