కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళ సీఎం పినరయ్ విజయన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను ఒక అబద్దాలకోరుగా అభవర్ణించారు. హమాస్ ఎలాంటిదో వార్తా పత్రికలు చదివే ప్రతీ ఒక్కరికీ తెలుసని అన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్ పై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఎర్నాకుళం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన మూడు పేలుళ్లపై కేరళ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు రాజీవ్ చంద్రశేఖర్ పై పినరయ్ విజయన్ వ్యాఖ్యలు చేశారు. దీనికి తాజాగా కేంద్ర సహాయ మంత్రి స్పందించారు.
‘‘నన్ను మతతత్వవాది అని నిందించడం, మా పార్టీ ప్రతీ భారతీయుడి శ్రేయస్సు చూడటం తప్ప ఇంకేదైనా చేస్తుందని ఆరోపించడం అబద్దమే అవుతుంది. ఆయన (పినరయి విజయన్) అబద్దాల కోరు. ఎస్‌డీపీఐ, ఫీఎఫ్‌ఐ, హమాస్‌లతో సంబంధాలు లేకపోవడమే మతవాదులు అని పిలవడానికి అర్హత అయితే.. బీజేపీలో ఎస్‌డీపీఐ, ఫీఎఫ్‌ఐ, హమాస్‌లతో సంబంధాలు లేవని చెప్పడానికి గర్వపడుతున్నాను.’’ అని అన్నారు.
కేరళలోని మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూవ్ మెంట్ లో నిర్వహించిన ర్యాలీలో హమాస్ నాయకుడు వర్చువల్ గా పాల్గొన్నట్లు వచ్చిన వార్తలపై చంద్రశేఖర్ స్పందిస్తూ.. ‘‘ఈ రోజు వార్తాపత్రికలు చదివే ప్రతి ఒక్కరికీ హమాస్ గురించి, వారు ఏమి చేశారో తెలుసు. హమాస్ ను భారత ప్రభుత్వం నిషేధించాల్సిన అవసరం లేదు. పది రోజుల క్రితం హమాస్ ఏం చేసిందో ఈ రోజు పేపర్ చదివిన ఎవరికైనా తెలుస్తుంది. చిన్నారులపై అత్యాచారం, హత్య, తలలు నరికి చంపారు. మీకు చట్టం అవసరం లేదు. మీకు కామన్ సెన్స్ అవసరం. రాడికలైజేషన్ సమస్య కొత్తదేమీ కాదు. అది 1997 నుంచి జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం మొదలవ్వలేదు. ’’ అని అన్నారు.
కాగా.. కేరళలోని కలమస్సేరిలోని క్రిస్టియన్ గ్రూప్ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. కలమస్సేరి పేలుడుకు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ త్రిస్సూర్ లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కానీ ఈ పేలుడులో ప్రమేయం ఎంత వరకు ఉందనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.