
Atiq Ahmed: అతిక్ అహ్మద్.. ఒకప్పటి మాఫియా డాన్. ఉత్తరప్రదేశ్లో మరి ముఖ్యంగా.. ప్రయాగ్ రాజ్ లో తిరుగులేని వ్యక్తి.. తన మాట కాదంటే.. ఎంతవాడినైనా .. హతమర్చే వరకు ఊరుకునే వాడు కాదు. ఆ ప్రాంతంలో ఓ నియంతలా ఎదిగాడు. ఆ తరువాత రాజకీయాలోకి అడుగుపెట్టి.. మరిన్ని దారుణాలకు ఒడికట్టారు. ఉమేష్ పాల్ హత్యకేసు మొత్తం కుట్రను జైలులో ఉండగానే రచించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతని సూచనల మేరకు పట్టపగలు ఉమేష్ పాల్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఉమేష్ పాల్ , అతని గన్ మెన్స్ ఇద్దరూ చనిపోయారు. ఇదే కాదు.. పలు తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు. కానీ.. యోగి సర్కార్ వచ్చిన తరువాత.. సీన్ రివర్స్ అయింది. సీఎం యోగి దెబ్బకు విలవిలాడాడు. భయపడుతూ.. బతికాడు. ఎక్కడ తనను ఎన్ కౌంటర్ అవుతానో యూపీ నుంచి పారిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి. నియంతలా బతికి వ్యక్తి.. శనివారం రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. అతిక్ అహ్మద్ నేర చరిత్ర తెలుసుకుందాం..
17 ఏళ్ల వయసులోనే హత్య
1962లో అలహాబాద్‌లో జన్మించిన అతిక్ అహ్మద్ ..తన బాల్యాన్ని పేదరికంలో గడిపాడు. అతని తండ్రి బతుకుదెరువు కోసం పట్టణంలో గుర్రపు బండి( టాంగా) నడిపేవాడు. అతీక్ చిన్నతనం నుంచే చేదు అలవాట్లకు బానిసయ్యాడు. డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడుతూ నేరస్తుడుగా మారాడు. ధనవంతుడు కావాలని తపన పడ్డాడు. అందుకే తప్పుడు వ్యాపారంలోకి దిగి వసూళ్లు చేయడం ప్రారంభించాడు. కేవలం 17 సంవత్సరాల వయస్సులో.. అతను హత్య ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో పాతబస్తీలో చాంద్ బాబా యుగం ఉండేది. పోలీసులు, నాయకులు ఇద్దరూ చాంద్ బాబా భయాన్ని వీడాలన్నారు. అందుకే అతీక్ అహ్మద్‌కు పోలీసులు, రాజకీయ నాయకుల మద్దతు లభించింది. కానీ తరువాత, అతిక్ అహ్మద్.. చాంద్ బాబా కంటే ప్రమాదకరమని నిరూపించాడు. అలహాబాద్ లో భూకబ్జా సిండికేట్ కు డాన్ గా ఎదిగాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆధారాలు లేకపోవడం, బాధితుతలు అతిక్ అహ్మద్ భయానికి ఫిర్యాదు చేయకపోవడంతో నేరాలు చేసుకుంటూ వెళ్లాడు.
గెస్ట్ హౌస్ కేసులో కీలక నిందితుడు
1995 జూన్‌లో మాయావతిపై దాడి చేసిన లక్నోలోని గెస్ట్‌హౌస్ ఘటనలో అతిక్ అహ్మద్ పేరు ప్రధాన నిందితుడు. మాయావతి గెస్ట్ హౌస్ ఘటనలో చాలా మంది నిందితులను క్షమించారు, కానీ అతిక్ అహ్మద్‌ను విడిచిపెట్టలేదు. మాయావతి అధికారంలోకి వచ్చిన తర్వాత అతిక్ అహ్మద్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కాబట్టి BSP అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. అతిక్ ఎల్లప్పుడూ వారి లక్ష్యంలోనే ఉన్నారు. మాయావతి హయాంలో.. అతిక్ అహ్మద్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంది. అతని ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడింది. యుపిలో మాయావతి ప్రభుత్వ హయాంలో.. అతిక్ అహ్మద్ కటకటాల వెనుక ఉండిపోయారు. BSP హయాంలో.. అతిక్ కార్యాలయం కూల్చివేయబడింది అలాగే అతని ఆస్తులు జప్తు చేయబడ్డాయి. అతన్ని జైలుకు పంపారు. ప్రయాగ్‌రాజ్‌లో అతని రాజకీయ పట్టు బలహీనపడటమే కాకుండా పూర్తిగా నాశనం చేయబడింది.
పొలిటికల్ ఏంట్రీ..
నిజానికి హత్యాకాండను అర్థం చేసుకోవాలంటే దాదాపు 19 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. గ్యాంగ్ స్టర్ ఉన్న అతడు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని భావించాడు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఆయన తన
27 ఏళ్ల వయసులో తొలిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. గెలిచాడు. ఆ తరువాత ఇదే స్థానం నుంచి వరసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపోందారు. సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ తరుపు పోటీ చేస్తూ గెలిచాడు. నేరాలు మితిమీరడంతో ఎస్పీ దూరం పెట్టింది. దీంతో అప్నాదళ్ లో చేరాడు. మళ్లీ 2004లో ఎస్పీలో చేరి పూల్పూర్ ఎంపీగా గెలిచాడు.
ఆయన ఎంపీ అయిన తర్వాత అలహాబాద్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి అతిక్ అహ్మద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆ స్థానం ఖాళీ అయింది. కొద్దిరోజుల తర్వాత ఉప ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈ స్థానంలో ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు అష్రఫ్‌ను ఎస్పీ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ బహుజన సమాజ్ పార్టీ మాత్రం అష్రఫ్ ముందు రాజు పాల్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఉప ఎన్నిక జరిగినప్పుడు.. షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి, BSP అభ్యర్థి రాజు పాల్ ..అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌ను ఓడించారు.
రాజు పాల్ హత్య కేసు
ఉప ఎన్నికల్లో అష్రఫ్ ఓటమి పాలవడంతో అతీక్ అహ్మద్ శిబిరంలో కలకలం రేగింది. అయితే క్రమంగా విషయం సద్దుమణిగుతోందని అందరూ భావించారు. రాజు పాల్ విజయం సాధించిన ఆనందం ఎంతో సేపు నిలవలేకపోయింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజుపాల్ కొన్ని నెలల తర్వాత 2005 జనవరి 25న పట్టపగలు కాల్చి చంపబడ్డాడు. ఈ మారణకాండలో దేవి పాల్, సందీప్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. కాగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంచలన హత్య యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో అప్పటి ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ పేర్లు నేరుగా తెరపైకి వచ్చాయి.
హత్యతో బిగిసిన ఉచ్చు..
పట్టపగలు ఎమ్మెల్యే రాజుపాల్ హత్యతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఎస్పీ ఎంపీ అతిక్ అహ్మద్‌పై బీఎస్పీ దాడికి దిగింది. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ కలిగి ఉన్న అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు కూడా నేరాల్లో పాలుపంచుకున్నారు. తమ్ముడు అష్రాఫ్, భార్య షాహిస్తా పర్వీన్, ముగ్గురు కొడుకులు కూడా క్రిమినల్ నేరాల్లో నిందితులే. రాజుపాల్ హత్య కేసులో దివంగత ఎమ్మెల్యే రాజుపాల్ భార్య పూజా పాల్ ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. ఆ నివేదికలో ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్, ఖలీద్ అజీమ్ పేర్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హై ప్రొఫైల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ఒక ముఖ్యమైన ప్రత్యక్ష సాక్షి. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నప్పుడు ఉమేష్ పాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను, కోర్టును ఆశ్రయించాడు.
దీని తరువాత.. కోర్టు ఆదేశాల మేరకు ఉమేష్ పాల్‌కు యుపి పోలీసులు భద్రత కోసం ఇద్దరు గన్నర్లను ఇచ్చారు. ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు హత్యపై విచారణ అనంతరం అప్పటి ఎస్పీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు సహా 11 మందిపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ విషయంలో విచారణ కొనసాగింది. అయితే ఈ కేసు దర్యాప్తుపై రాజుపాల్ కుటుంబం సంతృప్తి చెందకపోవడంతో ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు. ఈ హత్య కేసులో బలమైన సాక్షాలు దొరకడంతో ఈ గ్యాంగ్ స్టర్ డౌన్ ఫాల్ ప్రారంభం అయింది.
2009 లో ఐదుగురు నిందితులపై సిబి-సిఐడి అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. కానీ, రాజు పాల్ విసుగు చెంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. 20 ఆగస్టు 2019 నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజుపాల్ హత్యకేసులో సీబీఐ తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం నిందితులందరిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కవితా మిశ్రా ఆరుగురు నిందితులపై అభియోగాలు మోపారు. ఈ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే అష్రఫ్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు సహా మరికొందరు పాల్గొన్నారు. నిందితులందరిపై హత్య, హత్యకు కుట్ర, హత్యాయత్నం వంటి అభియోగాలు మోపారు. 2006లో సాక్షి అయిన ఉమేష్ పాల్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో ఇటీవల ఇతడికి జీవితఖైదు పడింది.
నిజానికి, ఈ దాడిలో మరణించిన ఉమేష్ పాల్, ప్రయాగ్‌రాజ్ రాజుపాల్ హత్య కేసులో ఒక ముఖ్యమైన ప్రత్యక్ష సాక్షి. అతని వాంగ్మూలంతోనే అతిక్ అహ్మద్ సహా నిందితులందరిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఉమేష్ పాల్‌కు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు యూపీ పోలీసులు ఆయనకు ఇద్దరు భద్రతా సిబ్బందిని అంటే గన్నర్లను సమకూర్చారు. కానీ ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ ప్రాంతంలో ఉమేష్ పాల్‌పై పూర్తి సన్నద్ధతతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు ఇప్పుడు మొత్తం కేసును విచారిస్తున్నారు. ప్రస్తుతం ఉమేష్ పాల్ హత్య విచారణ జరుగుతోంది.
ఎన్ కౌంటర్ భయం..
ఉమేష్ పాల్ హత్య అనంతరం సీఎం యోగి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘మాఫియాను మట్టిలో కలిపేస్తా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ హత్యలో పాల్గొన్న ఇద్దర్ని యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అలాగే.. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న అతీక్ కొడుకు అసద్ ను గత రెండు రోజుల క్రితం ఝాన్సీలో.. స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపారు. తన కొడుకు మరణానికి నేనే కారణమని అతీక్ అహ్మద్ ఏడ్చాడు. తన కుటుంబాన్ని వదిలిపెట్టాలని పోలీసులను కోరాడు. అతీక్ గ్యాంగ్ లో మొత్తం 144 మంది ఉన్నారని, వారి వద్ద రూ.11,000 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు.