
కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌ను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. యువతి పుట్టినరోజు పార్టీని జరుపుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవం సంచలనంగా మారింది. వివరాలు.. కనకపురానికి చెందిన నవ్య బెంగళూరులో నివసిస్తుంది. ఆమె ఇంటర్నల్ సెక్యూరిటీ విభాగంలో రెండో డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. అయితే కనకపురానికే చెందిన తన దూరపు బంధువు ప్రశాంత్‌తో నవ్య ప్రేమలో ఉంది. ప్రశాంత్-నవ్యలు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ప్రశాంత్ పీణ్య ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నారు. అయితే నవ్య పుట్టిన రోజు ఈ నెల 11 కాగా.. ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా శుక్రవారం బర్త్ డే పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక, శుక్రవారం సాయంత్రం నవ్య.. ప్రశాంత్‌తో కలిసి తన బర్త్‌డే పార్టీని చేసుకుంది. అయితే కొద్దిసేపటికే ప్రశాంత్ కత్తి తీసుకుని ఆమె గొంతు కోసి కత్తితో పొడిచి హత్య చేశాడు.
అయితే నవ్యను విక్టోరియా ఆసుపత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని రాజగోపాల్ నగర్ పోలీసులు తెలిపారు. అయితే నవ్య మరొకరితో చాట్ చేస్తుందనే అనుమానంతో ఆమెను హత్య చేసినట్టుగా ప్రశాంత్ ఒప్పుకున్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే నవ్య మృతదేహాన్ని పారవేయడం కుదరదనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రశాంత్ లొంగిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
‘‘గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా కుటుంబీకులు వ్యతిరేకించినా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మంగళవారంతో నవ్యకు 24 ఏళ్లు నిండాయి. నేను బర్త్ డే సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను. ఆమెకు సెలవు దినం కావడంతో శుక్రవారం కేక్ కటింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఆమె మధ్యాహ్నం నా ఇంటికి వచ్చి భోజనం చేసి కేక్ కట్ చేసింది. కాసేపటి తర్వాత ఆమె మొబైల్‌కి కాల్ వచ్చింది. ఆపై వాట్సాప్‌లో చాట్ చేయడం ప్రారంభించింది. ఎవరితో మాట్లాడున్నావని అడిగాను.. అయితే ఆమె సమాధానం ఇవ్వకుండా బాత్రూమ్ లోపలికి వెళ్లింది. ఆమె రిఫ్రెష్ అవ్వాలి అని చెప్పింది. అయితే వాట్సాప్‌లో ఆమె ఆన్‌లైన్‌లో కనిపించింది. ఆమె ఇంకా బాత్రూమ్ లోపల చాట్ చేస్తుందని నాకు అనిపించింది. నేను ఆమెను బయటకు రమ్మని అరిచాను. ఆమె బయటకు వచ్చినప్పుడు.. నేను ఆమెకు వాట్సాప్ నోటిఫికేషన్‌లను చూపించమని అడిగాను. ఆమె ప్రతిఘటించింది. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని చెప్పి నాపై గట్టిగా అరించింది. నేను సహనం కోల్పోయి ఆమెపై దాడి చేశాను’’అని ప్రశాంత్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.