
2024 ఎన్నికలకు సంబంధించి దేశంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కాయి. మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, ఈసారి అధికారానికి దూరం కాకూడదని కాంగ్రెస్, ఛాన్స్ వస్తే తాము ఉన్నత పదవిని అందుకోవాలని కొందరు విపక్ష నేతలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై ప్రతినిత్యం ఏదో ఒక సర్వే విడుదలవుతూనే వుంది. ఇక జాతీయ నేతల వ్యక్తిగత జాతకాలు ఎలా వుండనున్నాయో అనే దానిపై కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి దేశ ప్రధానిగా ఓ మహిళ అవుతుందని ఓ జ్యోతిష్యుడు చెబుతున్నారు. ఈ ఏడాది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పిన వ్యక్తే తాజాగా తన అంచనాలు వెల్లడించడంతో ఆమె ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
టిప్టూరు తాలూకాలోని నోనవినకెరెలోని శని ఆలయ ధర్మాధికారి డాక్టర్ యశ్వంత్ ‘‘గురూజీ’’ కొద్దిరోజుల క్రితం మీడియాలో మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్నారు. ఈ క్రమంలో ఒక మహిళ దేశానికి ప్రధాని మంత్రి అవుతారని యశ్వంత్ పేర్కొన్నారు. నక్షత్రాల పొజిషన్‌లో వచ్చిన మార్పుపైనే తన అంచనాలు వుంటాయని ఆయన తెలిపారు. 2024 ఫిబ్రవరిలో జరిగే మహా శివరాత్రి పండుగ తర్వాత భారతదేశ నాయకత్వంలో మార్పు వస్తుందన్నారు. అయితే పండుగకు ముందు ఎన్నికలు జరిగితే మోడీ మరోసారి ప్రధాని అవుతారని యశ్వంత్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీలలో ఎవరు ప్రధాని అవుతారని అడిగిన ప్రశ్నకు యశ్వంత్ సమాధానమిస్తూ తాను ఫిబ్రవరి తర్వాత మరోసారి అంచనా వేస్తానని తెలిపారు. ఆయన జోస్యంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషంలో మునిగి తేలుతుండగా.. ఆ పార్టీ మద్ధతుదారులు యశ్వంత్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.