రౌడీ షీటర్ కు రెండో భార్య: 17 సార్లు కత్తులతో పొడిచి మాజీ కార్పోరేటర్ ను చంపిన సహాయకులు

By telugu teamFirst Published Jun 25, 2021, 8:11 AM IST
Highlights

బెంగళూరులో మాజీ కార్పోరేటర్ రేఖ కదిరేష్ ను ఆమె సహాయకులే అతి దారుణంగా హత్య చేశారు. ఆమెను 17 సార్లు కత్తితో పొడిచారు. పేదలకు బ్రేక్ ఫాస్ట్ పంచిన తర్వాత ఆమెపై దాడి చేశారు.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని చలవాడిపాల్య మాజీ కార్పోరేటర్ ను అందరూ చూస్తుండగా ఇద్దరు సహాయకులు, ఆమె బంధువులు కత్తులతో పొడిచి చంపారు. 17 సార్లు ఆమెను కత్తులతో పొడిచారు గురువారం ఉద్యం తన కార్యాలయం వెలుపల పేదలకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేసిన మరుక్షణమే ఆమె హత్యకు గురైంది.  గురువారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. 

దాడి తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించారు. 45 ఏళ్ల రేఖ కదరేష్ బిజెపి తరఫున రెండు సార్లు కార్పోరేటర్ గా విజయం సాధించారు. రౌడీషీటర్ కదరేష్ కు రెండో భార్య. అతన్ని 2018 ఫిబ్రవరిలో కత్తులతో పొడిచి చంపారు. ఆమెకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాల ఆధారంగా, డిజిటల్ సాక్ష్యాలూ సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆమెపై దాడి చేసిన పీటర్, సూర్యలుగా గుర్తించారు. మరో అనుమానితుడు స్టీఫెన్ వారిద్దరికి సహాయపడినట్లు పోలీసులు గుర్తించారు. 

ఫ్లవర్ గార్డెన్ లోని రేఖ కార్యాలయం వెలుపల ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఆ ఘటన చోటు చేసుకుంది. రేఖ తన ఇంటి నుంచి ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. పేదలకు బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో పీటర్, సూర్య ఆమెపై దాడి చేశారు. 

ఒకతను కత్తితో ఆమె మెడపై పొడిచాడు. మరొకతను డాగర్ తో ఆమె తలపై మోదాడు. స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. దాడి నుంచి తప్పించుకోవడానికి ఆమె చిన్న సందులోకి పరుగు తీశారు. వదలకుండా ఆమెపై దాడి చేసి పలుసార్లు కత్తులతో పొడిచారు. ఆ తర్వాత పరారయ్యారు. స్థానికులు ఆమెను సమీపంలోని కెంపెగౌడ వైద్య విజ్ఞాన సంస్థ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. 

పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హంతకుల గురించి తాము ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం రాబట్టినట్లు ఎసీపీ ఎస్. మురుగన్ చెప్పారు. వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. కీమ్స్ ఆస్పత్రిలోని ఆమె కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. 

పీటర్ రేఖకు బంధువు మాత్రమే కాకుండా ఆమెకు బలమైన మద్దతుదారు కూడా. పీటర్ ఆమెకు వ్యతిరేకంగా ఎందుకు మారాడనేది తెలియడం లేదు. తన తండ్రి మరణం తర్వాత తాను, తన సోదరి బీటీఎం లే అవుట్ లో ఉంటున్నామని, తన వద్దకు రావాలని తల్లిని పలుమార్లు కోరామని రేఖ కుమారుడు రాహుల్ చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించకుండా చలవాడిపాళ్యలో ఉంటూ వస్తున్నారని చెప్పాడు. పీటర్ తన తండ్రికి, తల్లికి సన్నిహితుడని తెలిపాడు. 

తాము కదిరేష్ దంపతుల పాత ప్రత్యర్థులపై దృష్టి పెట్టామని, హత్యకు ఆర్థిక వివాదాలు గానీ రాజకీయాంశాలు గానీ కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో కదిరేష్ బంధువులు పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పీటర్, సూర్య, స్టీఫెన్ బంధువులు. కదిరేష్ హంతకుల్లో ఒకరిని హత్య చేసిన కేసులో పీటర్ ను గతంలో అరెస్టు చేసినట్లు, అతను బెయిల్ మీద బయట ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

రేఖ హత్యపై ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప స్పందించారు. 24 గంటల లోపల నిందితులను పట్టుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.   

click me!