13 ఏళ్ల బాలికపై అత్యాచారం,హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. సీఐడీ ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి ..  

By Rajesh KarampooriFirst Published Nov 8, 2022, 8:42 PM IST
Highlights

అస్సాంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దురంగ్​ జిల్లాలోని ఓ ధనవంతుల ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్టు  చిత్రీకరించారు.సీఐడీ ఎంక్వైరీలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన అస్సాం పోలీసు సర్వీస్ అధికారితో పాటు  ముగ్గురు ప్రభుత్వ వైద్యులను సీఐడీ అరెస్టు చేసింది

అస్సాంలో సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లాలోని ఓ ధనవంతుల ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలిక ను జూన్ లో అత్యాచారం చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్టు  చిత్రీకరించారు. అది ఆత్మహత్య కాదనీ, ఆ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారని సీఐడీ ఎంక్వైరీలో తేలింది. నిందితులతో పాటు ఈ కేసులో నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన అస్సాం పోలీసు సర్వీస్ అధికారితో పాటు  ముగ్గురు ప్రభుత్వ వైద్యులను సీఐడీ అరెస్టు చేసింది. ఘటన దరంగ్ జిల్లాలోని ధులా పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. దర్రాంగ్ జిల్లాలోని ఓ ధనవంతుల ఇంట్లో పనిచేస్తున్న బాలిక జూన్‌లో తన యజమాని ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. ఈ  కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దరాంగ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రూపమ్ ఫుకాన్‌ను సీఐడీ అరెస్టు చేసింది. రూపమ్ ఫుకాన్‌ ఆగస్ట్‌లోనే సస్పెండ్ చేయబడ్డారు.

అలాగే.. బాధితురాలి మృతదేహానికి మొదటి పోస్ట్‌మార్టం నిర్వహించిన మంగళ్‌దై సివిల్ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్యులు అరుణ్ చంద్ర దేకా, అజంతా బోర్డోలోయ్ మరియు అనుపమ్ శర్మలను కూడా సోమవారం అరెస్టు చేసినట్లు సిఐడి తెలిపింది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. అరెస్టయిన అదనపు ఎస్పీ, అప్పటి దరాంగ్ ఎస్పీ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.బాలిక పని చేస్తున్న ఇంటి యాజమానిని కూడా అరెస్టు చేశారు.  

తమ కూతురు హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగస్టు 12న సోనిత్‌పూర్ జిల్లాలో బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.ఆ తర్వాత వెంటనే దరాంగ్ ఎస్పీ రాజ్‌మోహన్ రే, అదనపు ఎస్పీ రూపమ్ ఫుకాన్, ధులా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉత్పల్ బోరాలను సస్పెండ్ చేశారు. ఇప్పటికే బోరాను సీఐడీ అరెస్ట్ చేసింది.

click me!