రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ప‌రిమితి తొలగించండి: బీహార్ సీఎం డిమాండ్

By Rajesh KarampooriFirst Published Nov 8, 2022, 8:02 PM IST
Highlights

విద్యా ఉపాధి అవ‌కాశాల్లో రిజర్వేషన్ పరిమితిని 50 శాతానికి పైగా పెంచాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా  కుల గ‌ణ‌న నిర్వహించాలని కేంద్రానికి సూచించారు. 

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్)రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం కోర్టు నిర్ణయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాగతించారు. అలాగే రిజర్వేషన్ పరిమితిని 50 శాతానికి పైగా పెంచాలని అన్నారు. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన చేయాలని డిమాండ్ చేశారు.

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బ‌ల‌హీన ప‌డిన వ‌ర్గాల (ఈడ‌బ్ల్యూఎస్‌)కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖాలైన  పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ, కాంగ్రెస్ లు స్వాగతించగా.. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో రివ్యూ పిటిషన్ దాఖాలు చేయడానికి సిద్దమవుతోంది.

ఈ నేప‌థ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. పాట్నాలో ఓ కార్యక్రమంలో ఆయన మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో సుప్రీంకోర్టు స‌రైన తీర్పు వెల్లడించిందనీ, తాము ఎల్ల‌వేళ‌లా రిజ‌ర్వేష‌న్ కోటాకు మ‌ద్ద‌తుగా ఉన్నామని అన్నారు. బీహార్ ప్రభుత్వం పేదల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందన్నారు. ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. 

అందుకే రాష్ట్రంలో కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహిస్తున్నామనీ,దీనివల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయని, దీంతో ప్రజలకు మెరుగైన ప్రణాళికలు రూపొందించగలుగుతామన్నారు.  జాతీయ స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుందని నితీశ్ కుమార్ అన్నారు. జనాభా గణనలో అన్ని కులాలు, సోదర వర్గాల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నట్లు నితీశ్ తెలిపారు. సరైన పరిస్థితి తెలిసినప్పుడు వారికి సహాయం చేయడమే దీని ఉద్దేశ్యమనీ అన్నారు.

ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణాల పేద కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని నితీశ్ కుమార్ స్వాగతించారు. ప్రతి తరగతి, ప్రతి కులంలో పేదలు ఉన్నారని అన్నారు. వారికి అవసరమైన సహాయం అందించడం ప్రభుత్వ పని. ఈ పని బీహార్‌లో జరుగుతోందని, దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. రిజర్వేషన్ పరిమితిని పెంచాలని  వాదించారు. రిజర్వేషన్ల పరిధిని 50 శాతానికి మించి పెంచితే బాగుంటుందని సీఎం అన్నారు. ఇది వీలైనంత ఎక్కువ మందికి అవకాశం దక్కుతోందని అన్నారు.  

click me!