
Assam-Meghalaya border dispute: గత 50 ఏండ్లుగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు ముగింపు పలికారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ఒప్పందంతో 1972 నుంచి నెలకొన్న 884 కిలోమీటర్ల సరిహద్దు వివాదంలో ప్రధాన సమస్యలకి పరిష్కారం లభించింది. సరిహద్దుకు సంబంధించి 12 అంశాల్లో వివాదం కొనసాగుతుండగా.. తాజా ఒప్పందంతో ఆరు అంశాలు పరిష్కారమయ్యాయి. అంటే 70 శాతం సరిహద్దు సమస్య ముగిసినట్లే. మిగతా 30 శాతం సరిహద్దుకు సంబంధించిన ఆరు అంశాలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
గతంలో ఎన్నో సార్లు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర రాష్ట్రాల నేతలు సూచించారు. దీంతో ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. తమకున్న అభ్యంతరాలు, పరిష్కారాలతో కూడిన డ్రాఫ్ట్‌ను హోం వ్యవహారాల శాఖకు అందజేశాయి. వీటిని పరిశీలించిన కేంద్రం ఇద్దరు సీఎంలతో చర్చించి, తగిన పరిష్కారాలు సూచించింది. దీంతో అసోం-మేఘాలయ సీఎంలు ఇద్దరూ తాజా ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మేఘాలయ సీఎం సంగ్మా మాట్లాడుతూ .. "సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు మాకు దిశానిర్దేశం చేసినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి దశ పరిష్కారం జరిగింది. హిమంత బిస్వా శర్మ వల్లనే ఇది సాధ్యమైంది" అని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, షా లు తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలను పరిష్కరించగలిగితే, రెండు రాష్ట్రాలు మధ్య సమస్యలను పరిష్కరించలేమ అనే వైఖరితో కేంద్రం అనేక సూచనలు చేసిందని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. . నేడు .. అస్సాం,మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదం పరిష్కరించబడింది. ఈ ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు.ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. మిగిలిన 6 పాయింట్లు వీలైనంత త్వరగా పరిష్కరించబడతాయని అమిత్ షా పేర్కొన్నారు, ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
1972లో అస్సాం- మేఘాలయల విభజన జరిగినప్పుడు దీర్ఘకాల భూవివాదం చెలరేగింది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ఒప్పందంలో సరిహద్దుల విభజన యొక్క వివిధ రీడింగుల ఫలితంగా సరిహద్దు సమస్యలు వచ్చాయి. ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందు, ఇద్దరు సీఎంలు MHAతో చివరి రౌండ్ చర్చలు జరిపినట్లు సమాచారం.
MHA పరిశీలన కోసం జనవరి 31న అస్సాం, మేఘాలయ సీఎంలు షాకు ముసాయిదా తీర్మానాన్ని సమర్పించారు. అస్సాం- మేఘాలయ ప్రభుత్వాలు 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.