
Kumbh Mela 2025 : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఆయన పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా సనాతన సంస్కృతి గొప్పగా వెలుగొందుతోందని ఆయన అన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ సర్కార్‌ని సీఎం శర్మ మెచ్చుకున్నారు.
"నేను మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి, పరిపాలన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సనాతన సంస్కృతి ప్రపంచం ముందు నిలిచింది. సనాతన ధర్మమే ప్రపంచానికి గతం, వర్తమానం, భవిష్యత్తు అని ఈ మహా కుంభమేళా నిరూపిస్తుంది" అని సీఎం శర్మ అన్నారు.
ఇదిలావుంటే మహా శివరాత్రి ఏర్పాట్లపై యూపీ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ప్రశాంత్ కుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా జరిగే ప్రధాన స్నానానికి అన్ని ఏర్పాట్లు చేశామని సీఎస్ సింగ్ చెప్పారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సింగ్ అన్నారు.
గంగా నదిలో పూడిక తీసి నీటి మట్టం పెంచాలని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నీటి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, సంగమంలో ఆక్సిజన్ స్థాయి 9-10 మధ్య ఉందని, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) మూడు కంటే తక్కువగా ఉందని తెలిపారు.
డీజీపీ కుమార్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. మహా కుంభమేళా కోసం ట్రాఫిక్ కంట్రోల్, రద్దీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 50కి పైగా కేసులు నమోదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియాపై నిఘా పెట్టామని తెలిపారు. (ఏఎన్ఐ)