నన్నే టోల్ అడుగుతావా..? టోల్‌ప్లాజా బారికేడ్లను విరగ్గొట్టిన ఎమ్మెల్యే..? (వీడియో)

First Published 18, Jul 2018, 3:50 PM IST
Highlights

తనను టోల్‌ కట్టామన్న టోల్‌ ప్లాజా సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఎమ్మెల్యే సిబ్బందిపై వాగ్వివాదానికి దిగడంతో పాటు అక్కడ ఉన్న బారికేడ్లను విరగ్గొట్టి వెళ్లిపోయాడు

ఇటీవలి కాలంలో టోల్‌ప్లాజాల వద్ద ప్రజాప్రతినిధుల హంగామా ఎక్కువౌతుంది.. టోల్ అడిగినందుకు టోల్‌ప్లాజా సిబ్బందిని చావబాదడం లేదంటే అక్కడ విధ్వంసానికి  పాలవ్వడం.. ఆ వార్తలు మీడియాలో హల్‌చల్ చేయడం షరా మామూలు అన్నట్లుగా తయారైంది. తాజాగా తనను టోల్‌ కట్టామన్న టోల్‌ ప్లాజా సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఎమ్మెల్యే సిబ్బందిపై వాగ్వివాదానికి దిగడంతో పాటు అక్కడ ఉన్న బారికేడ్లను విరగ్గొట్టి వెళ్లిపోయాడు.

కేరళలోని పూంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ గత రాత్రి త్రిసూర్ నుంచి కొచ్చికి తన ఆడీ కారులో వెళుతుండగా మార్గమధ్యంలో పాలియెక్కర వద్ద టోల్‌ప్లాజ్ వచ్చింది.. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను టోల్ చెల్లించాల్సిందిగా కోరారు. అంతే కారులో ఉన్న ఎమ్మెల్యే జార్జ్ వెంటనే కిందకి దిగి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న బారికేడ్లను అనుచరులతో కలిసి విరగ్గొట్టి దర్జాగా కారెక్కి వెళ్లిపోయాడు..

కేరళ అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యుడు పీసీ జార్జ్.. ఆయన ఏడవసారి శాసనసభలో అడుగుపెట్టాడు. ఈయన వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. 2017 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే హాస్టల్లో బస చేసిన టైంలో క్యాంటిన్ బాయ్ ఆలస్యంగా భోజనం తీసుకొచ్చాడన్న కోపంతో అతని చెంప పగలగొట్టాడు. అలాగే గత ఏడాది జూన్ 29 న భూమి వివాదానికి సంబంధించి తనపై నినాదాలు చేస్తూ ఆరోపణలకు పాల్పడినందుకు ఎస్టేట్ కార్మికులను తుపాకీతో బెదిరించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది.

మరోవైపు వాహనాన్ని అనుమతించడంలో కొంతజాప్యం జరిగిందని ఈ లోపు ఎమ్మెల్యే తమతో వాగ్వివాదానికి దిగారని టోల్‌ప్లాజా ఉద్యోగులు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే చర్యపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. 

 

Last Updated 18, Jul 2018, 3:50 PM IST