
బెంగళూరు : ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలను పండగతో పోలుస్తుంటారు. ఎందుకంటే భవిష్యత్ పాలన కోసం పాలకులను ఎన్నుకునేందుకు ఓటర్లు తీర్పునిచ్చే కీలకమైన ప్రక్రియే ఈ ఎన్నికలు. అయితే కాలంతో పాటే అన్నీ మారుతున్నట్లే ఎన్నికల ప్రక్రియలో పెను మార్పులు వచ్చి పండగ కాస్త దండగ అన్నట్లుగా తయారయ్యింది. ఒకప్పుడు నీతి నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకునే స్థాయి నుండి ఇప్పుడు డబ్బులు ఖర్చుచేసే నాయకులనే గెలిపించే స్థాయికి ఓటర్లు దిగజారారు. చివరకు తమకు డబ్బులు, బహుమతులు ఇవ్వడం లేదంటూ రాజకీయ నాయకులను నిలదీయడం, ఆందోళనలకు దిగే స్థాయికి ఓటర్లు చేరుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో బహుమతులు పంచడం అన్ని పార్టీలకు, అభ్యర్థులకు అనివార్యంగా మారింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు చీరలు, వంట సామాగ్రి, ఇతర వస్తువులను రెడీ చేసుకుంటున్నారు. కొందరు నాయకులయితే ఇటీవల జరిగిన పండగలు, శుభకార్యాలు, వేడుకల సందర్భంగా గిప్టుల పంపిణీ ప్రారంభించారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజకీయ నాయకులు పంచుతున్న గిప్టులు ఓటర్ల ప్రాణాలమీదకు తెస్తున్నాయి.
ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష నాయకులని తేడాలు లేకుండా పురుష ఓటర్లకయితే మద్యం, డబ్బులు... మహిళలకయితే వంట సామాగ్రి పంపిణీ చేపట్టారు. ఇలా ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన నాణ్యతలేని కుక్కర్ పేలిన ఘటన రాజధాని నగరం బెంగళూరులోని సోమేశ్వర కాలనీలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఉచితంగా వచ్చిందని ఆశపడిన మహిళ తీవ్రంగా గాయపడింది.
ఈ కుక్కర్ పేలుడు ఘటన తర్వాత కర్ణాటకలోని ప్రముఖ మీడియా సంస్థ సువర్ణ న్యూస్ ఓ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇలా ఓటర్లకు పంచుతున్న బహుమతుల నాణ్యత తెలుసుకునేందుకు ప్రయత్నించింది. వివిధ వస్తువలను తయారుచేసే స్థానిక ప్యాక్టరీలను మీడియా ప్రతినిధులు సంప్రదించగా... ఎన్నికల్లో పంచేందుకు తక్కువ ధరకే వస్తువులను నాయకులు కొనుగోలు చేస్తారు కాబట్టి నాణ్యత వుండదని తెలిపారు. ఓటర్లు కూడా ఉచితంగా వస్తున్నాయి కాబట్టి నాయకులు అందించే వస్తువుల నాణ్యత చూడరని అన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఎన్నికల సమయంలో అందించే బహుమతులు ఒక్కోసారి ఇలా ఓటర్ల ప్రాణాలమీదకు తెస్తున్నాయి.
ముఖ్యంగా మహిళా ఓటర్ల కోసం అన్ని పార్టీలు కుక్కర్లను తయారుచేయిస్తున్నాయి. కేవలం రూ.400-450 కి 5లీటర్ల కుక్కర్ వస్తుందంటే దాని నాణ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాణ్యతలేని కుక్కర్లు వందలకొద్ది తయారుచేయిస్తున్నారు వివిధ పార్టీల అభ్యర్థులు. బెంగళూరు కుక్కర్ పేలుడు ఘటన తర్వాత ఇలాంటి కుక్కర్లలో వంట వండేందుకు ప్రజలు జంకుతున్నారు. కాబట్టి ఇకనైనా మేలుకుని తాయిలాలకు ఆశపడకుండా తమ ఓటును హక్కుగా భావించి వినియోగించుకుంటారేమో చూడాలి.