రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ కంటిన్యూ? సచిన్ పైలట్‌కు ఆ పదవి ఇచ్చే ఛాన్స్

By Mahesh KFirst Published Oct 1, 2022, 1:32 PM IST
Highlights

రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ మళ్లీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచిన్ పైలట్‌కు డిప్యూటీ సీఎం సీటు ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికతోపాటు రాజస్తాన్‌లో రాజకీయం రగిలింది. అశోక్ గెహ్లాట్ రాజీనామా చేస్తే సీఎంగా సచిన్ పైలట్‌కు అవకాశం ఇవ్వరాదని, ఆయన తిరుగుబాటు చేసిన సమయంలో గెహ్లాట్ వెంటే ఉన్న వారిలో నుంచి సీఎంను ఎంచుకోవాలని డిమాండ్ చేస్తూ అశోక్ గెహ్లాట్ మద్దతుదారులైన సుమారు 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తాను కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు అశోక్ గెహ్లాట్ చెప్పారు. అయితే, సీఎం సీటుపై నిర్ణయం సోనియా గాంధీ చేతిలోనే ఉన్నదని ఆయన విలేకరులకు తెలిపారు. తాజాగా, కొన్ని విశ్వసనీయమైన వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి.

రాజస్తాన్ సీఎంగా మళ్లీ అశోక్ గెహ్లాట్‌ కొనసాగనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, సచిన్ పైలట్‌కు ఓ కీలక అవకాశాన్ని ఇస్తున్నట్టు వివరించాయి. సచిన్ పైలట్ మళ్లీ రాజస్తాన్ డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి.

సచిన్ పైలట్ రెండేళ్ల క్రితం ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నదని బాంబు పేల్చారు. ఆయన అప్పుడు రాజస్తాన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే, రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కూడా. ఈ తిరుగుబాటు తర్వాత సచిన్ పైలట్ కూడా జ్యోతిరాదిత్య సింధియా తరహా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి. కానీ, వాటిని సచిన్ పైలట్ కొట్టేశారు.

కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మూలంగా కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్‌ను రాజస్తాన్ సీఎం, రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా తొలగించింది. ఆ తర్వాత అధిష్టానం సర్దిచెప్పడంతో తన తిరుగుబాటును సచిన్ పైలట్ విరమించుకున్నాడు. తాజాగా, అశోక్ గెహ్లాట్ వర్గం తిరుగుబాటు చేయడం అధిష్టానానికి అసంతృప్తి కలిగించింది. ఈ తిరుగుబాటుతో సచిన్ పైలట్‌కు గతంలో తాను పోగొట్టుకున్న డిప్యూటీ సీఎం పీఠాన్ని మళ్లీ అధిరోహించడానికి అవకాశం దక్కింది.

కాంగ్రెస్ చీఫ్ కోసం అశోక్ గెహ్లాట్ సరైన వ్యక్తి అని అధిష్టానం భావించింది. అంతకు ముందే ఆయన సీఎం పదవి వదులుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, సీఎం ఎవరనే నిర్ణయం తమ వద్దే ఉంటుందని కూడా పేర్కొంది. కానీ, సీఎం పదవి వెంటబెట్టుకునే చీఫ్ కోసం పోటీ చేద్దామని గెహ్లట్ భావించారు. కానీ, ఒకరికి ఒక పదవి అనే నిబంధనను కాంగ్రెస్ పాటిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ప్రకటన తర్వాతే రాజస్తాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటు లేసింది. సచిన్ పైలట్‌ను సీఎంగా చేయరాదని, సచిన్ తిరుగుబాటు చేసినప్పుడు గెహ్లాట్‌తో ఉన్నవారిలో నుంచే సీఎంను ఎన్నుకోవలని అల్టిమేటం పెట్టారు. ఇది అధిష్టానాన్ని తీవ్రంగా అసంతృప్తి పరిచింది.

click me!