
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఉభయసభలలో కొనసాగుతున్న నిరసనలు, అంతరాయలపై స్పందిస్తూ.. పార్లమెంట్‌లో సజావుగా చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించినందున.. సభ మళ్లీ యథాతథ స్థితికి రావాల్సిందేనని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష పార్టీ కూటమి ‘‘ఇండియా’’ డిమాండ్ చేస్తుంది.
దీంతో పార్లమెంట్ ఉభయసభలలో గందరగోళన పరిస్థితులు చోటుచేసుకుంటున్నారు. దీంతో ఉభయసభలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనిని అనుమతించిన స్పీకర్ ఓం బిర్లా.. అన్ని పార్టీలతో చర్చించిన అనంతరం చర్చకు సమయాన్ని నిర్ణయించనున్నట్టుగా ప్రకటించారు.
ఈ పరిణామాలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘‘పార్లమెంట్‌ను నిర్వహించడానికి ప్రతిపక్షాలు అనుమతించాలని నా అభిప్రాయం’’ అని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతి తెలుపడం న్యాయమైన అంశమని.. అప్పుడు సభకు అనుమతి ఇవ్వాలని.. ఈ ప్రశ్నకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలంటూ విపక్షాల వ్యూహాలను ఒవైసీ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో కొనసాగుతున్న నిరసనల కారణంగా విలువైన పార్లమెంటరీ సమయాన్ని కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేయాలని, వారి వైఫల్యాలను బయటపెట్టాలని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కోల్పోవడం దురదృష్టకరమని.. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు.
సభలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే, గందరగోళం మధ్య ముఖ్యమైన బిల్లులు ఆమోదించబడుతున్న విషయాన్ని కూడా ఒవైసీ హైలైట్ చేశారు. ముఖ్యమైన బిల్లులు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం పొందుతున్నాయని.. అందువల్ల బిల్లులోని లోపాలను బయటపెట్టలేకపోతున్నామని చెప్పారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో హింసను మణిపూర్‌లో జాతి ఘర్షణలతో పోల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘‘రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో హింసను చర్చిద్దాం అని ప్రభుత్వం చెప్పడం ద్వారా మణిపూర్‌లో హింసను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కేబినెట్ మంత్రి కుకీలపై జరిగిన హింసను ఇతర రాష్ట్రాల్లోని సంఘటనలతో పోల్చడం చాలా తప్పు’’అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.