గుజరాత్ అల్లర్లపై అమిత్ షా కామెంట్‌కు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్.. ‘ఏం గుణపాఠాలు?’

By Mahesh KFirst Published Nov 26, 2022, 1:05 PM IST
Highlights

గుజరాత్ అల్లర్లపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా సాహబ్ మాకు ఏ గుణపాఠం చెప్పారని గుర్తుంచుకోవాలి అంటూ విరుచుకుపడ్డారు.
 

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో గుజరాత్ అల్లర్ల ప్రస్తావన వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ అల్లర్లను గుజరాత్‌లో ఓ ప్రచార క్యాంపెయిన్‌లో పరోక్షంగా ప్రస్తావించారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 2002లోనే వారికి గుణపాఠం నేర్పామని అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల కోసం జుహపురలో ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ‘కేంద్ర మంత్రి, ఎంపీ, అమిత్ షా గుజరాత్‌లో మాట్లాడారు. నేను కూడా గుజరాత్‌ వేదికగానే ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాను. 2002లో మీరు ఏం గుణపాఠం చెప్పారు? బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి వదిలిపెట్టాలనే గుణపాఠం నేర్పారా? బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు హంతకులకు విముక్తి ప్రసాదించాలని నేర్పించారా? ఎహెసాన్ జాఫ్రీని చంపేయాలని చెప్పారా? మీరు ఏం నేర్పారని మమ్మల్ని గుర్తుంచుకోమంటారు?’ అని ఎదురుదాడికి దిగారు.

Also Read: ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్ల దోషి.. బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న కూతురి కోసం క్యాంపెయిన్

మీరు గుజరాత్‌లో ఉన్నప్పుడు ఇక్కడ అల్లర్లు జరిగాయని, ఏం గుణపాఠం నేర్పారు కాబట్టి, మీరు ఢిల్లీకి వెళ్లాక అక్కడ కూడా అల్లర్లు జరిగాయి? అని నిలదీశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాంపెయిన్ చేస్తూ ఖేడా జిల్లా మహుదా పట్టణంలో అమిత్ షా గుజరాత్ అల్లర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ 2002 సంవత్సరాన్ని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో గుజరాత్‌లో తరుచూ మతోన్మాద దాడులు, అల్లర్లు జరిగేవి. వేర్వేరు కమ్యూనిటీలను కాంగ్రెస్ రెచ్చగొట్టి పరస్పరం దాడులకు ఉసిగొల్పేది. అలాంటి అల్లర్ల ద్వారా కాంగ్రెస్ దాని ఓటు బ్యాంకు ను బలోపేతం చేసుకునేది. సొసైటీలోని మెజార్టీ ప్రజలకు అన్యాయం చేసేది’ అని అన్నారు. ఇలాంటి హింస అక్కడ నిత్యం జరిగేది అందుకే 2002 అల్లర్లు జరిగాయని ఆరోపణలు చేశారు. వారికి కాంగ్రెస్ మద్దతు ఉండేదని తెలిపారు. 

కానీ, వారికి 2002 లో ఒక గుణపాఠం చెప్పారని వివరించారు. ఈ శక్తులు హింసా మార్గాన్ని వదిలిపెట్టాయని అన్నారు. 2002 నుంచి 2022 వరకు వారంతా హింసకు దూరంగానే ఉన్నారని పేర్కొన్నారు. మత పరమైన హింసలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుని, గుజరాత్‌లో శాశ్వత శాంతిని బీజేపీ స్థాపించిందని తెలిపారు. అప్పటి గుణపాఠంతో వారు ఇప్పటికీ తలలు ఎత్తుకో లేకపోతున్నారని అన్నారు.

click me!