పేదలపై పన్నుల భారం.. సంపన్నులకు పన్నులు, రుణాల మాఫీ.. : కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

By Mahesh KFirst Published Aug 11, 2022, 5:35 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఉచితాలు అనే మాట ద్వారా కేంద్ర ప్రభుత్వం సంక్షేమాన్నే కాలరాసేలా మాట్లాడుతున్నదని, మరి సంపన్నులకు ఎందుకు లక్షల కోట్లు రుణాల మాఫీ చేస్తున్నారని ప్రశ్నించారు. తినే ఆహారంపైనా పన్నులు వేసిన కేంద్రం.. పెద్ద కంపెనీలకు ఎందుకు ఐదు లక్షల కోట్ల పన్నులు మాఫీ చేసిందని ప్రశ్నించారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పేదలపై పన్ను భారం మోపుతూ మరో వైపు సంపన్నులకు పన్నులు మాఫీ చేస్తున్నదని, లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నదని అన్నారు. వారి సన్నిహితులకు, సూపర్ రిచ్ పీపుల్స్‌కు రూ. 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద కంపెనీలకు రూ. 5 లక్షల కోట్ల పన్నులు మాఫీ చేశారని ఆరోపించారు. కానీ, ఎన్నుడూ లేని విధంగా పేద ప్రజలపై పన్నులు మోపుతున్నదని వివరించారు. తినే ఆహారంపై పన్నులు విధించి సంపన్నులకు పన్నులు మాఫీ చేయడమేమిటనీ ఆయన నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా బియ్యం, గోధుమలు, పాలు,  పనీర్, లస్సీ వంటివాటిపై పన్ను విధించి వికటాట్టహాసం చేస్తున్నదని మండిపడ్డారు. పేద ప్రజలను దోచుకుని పెద్దలకు రుణ మాఫీలు చేస్తున్నదని ఆవేదన చెందారు. వారికి సన్నిహితులుగా ఉన్న సంపన్నులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని పేర్కొన్నారు.

2014లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నులో 42 శాతం వరకు ఇచ్చేవని, ఇప్పుడు ఆ వాటాను 29 నుంచి 30 శాతానికి తగ్గించారని వివరించారు. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర అంతకు ముందు  కంటే కూడా ఎక్కువ డబ్బులు ఉండాలని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తమ దగ్గర డబ్బులు లేవని చెబుతూ సైనికులు పెన్షన్లు ఇవ్వలేమని అగ్నిపథ్ పథకాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సైన్యానికి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవని ఏనాడూ ప్రభుత్వం చెప్పలేదని, ఇదే తొలిసారి అని అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర సైనికులకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవనే వాదనలు వచ్చాయని గుర్తు చేశారు. మరి కేంద్రప్రభుత్వం దగ్గరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.

ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 20 లక్షల కోట్లు ఉండేదని, ఇప్పుడు అది 40 లక్షల బడ్జెట్‌కు చేరిందని, అయినా.. కేంద్రం మాత్రం డబ్బులు లేవని పేదలపై పన్నులు వేస్తున్నదని మండిపడ్డారు. పేదలకు అంతో ఇంతో ఆసరాగా మారిన ఉపాధి హామీ పనులనూ నిర్వీర్యం చేయాలని కేంద్రం భావిస్తున్నదని, ఇది పేదల పొట్ట కొట్టడమేనని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఉచితాలు అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు నానాయాగీ చేస్తున్నారని చెప్పారు. రేషన్ బియ్యం కారణంగా ఎన్నో కోట్ల మంది పేదలు ప్రతి రోజు ఆహారం తింటున్నారని, ఇలాంటి మరెన్నో కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడగలిగారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాంటి చేయూతను వారు ఉచితాలు అని, రెవ్డీ కల్చర్ అని దీర్ఘాలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది దేశానికి ప్రమాదం అని నొక్కి వక్కాణిస్తున్నారని వ్యంగ్యం పోయారు.

పేదలకు ఇస్తే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పే ప్రభుత్వం.. సంపన్నులకు ఎందుకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నదని నిలదీశారు. ఆ లక్షల కోట్లు రుణమాఫీ చేయకుంటే.. ఈ రోజు తినే ఆహారంపై పన్ను వేయాల్సి వచ్చేది కాదని, సైనికులకు పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి దాపురించేది కాదని అన్నారు.

click me!