ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్టు, ఈడీ కస్టడీని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు స్వీకరించలేదు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు, ఈడీ కస్టడీని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు స్వీకరించలేదు. వచ్చే బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని కేజ్రీవాల్ తరుఫు న్యాయవాదికి స్పష్టం చేసింది.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో తన అరెస్టు, ఈడీ రిమాండ్ ను సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును, 2024 మార్చి 22న ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని అందులో పేర్కొన్నారు. తక్షణమే తనను కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరారు.
undefined
ఈ పిటిషన్ పై ఆదివారంలోగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తక్షణ విచారణ జరపాలని కోరారు. అయితే అత్యవసర లిస్టింగ్ ను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈ కేసును బుధవారం పునఃప్రారంభిస్తామని తెలిపింది. దీంతో హోలీ సెలవుల అనంతరమే కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. అంతకు రెండు గంటల ముందు ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తరువాత అరెస్ట్ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. అయితే ఈడీ బలవంతపు చర్యల నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ కు రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే సీఎం అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టును దేశంలోని విపక్ష పార్టీలు ఖండించాయి.