
Gujarat Assembly elections: పంజాబ్ లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇప్పుడూ గుజరాత్ కన్నువేసింది. గుజరాత్ లో ఈ ఏడాది చివరిలో జరుగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి విజయం సాధించాలని, అధికారం చేజిక్కించుకోవాలని ఢిల్లీ సీఎం, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ఆప్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ హామీతో ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 26న సీఎం కేజ్రీవాల్ గుజరాత్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన విద్యుత్తు పై టౌన్ హాల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉచిత విద్యుత్ హామీని ప్రజల ముందుంచేందుకు తీసుకరావాలని కసరత్తు చేస్తున్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా గుజరాత్‌లో అత్యధిక విద్యుత్ టారిఫ్ ఉన్నాయనీ, గ్రామాల్లో 24 గంటలూ సరఫరా చేయడం లేదని ఆప్ ఆరోపిస్తోంది. రైతులకు వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందడం లేదని ఆప్ విమర్శిస్తుంది. ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత ఆప్ ఇప్పుడు గుజరాత్‌లో ఉచిత విద్యుత్ పధకానికి శ్రీకారం చుడతామని భరోసా ఇవ్వనుంది. ఇందుకోసం ఆప్ భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ ప్రచారానికి 'జన్ సంవాద్' ప్రచారం అని పేరు పెట్టనున్నారు. ఉచిత విద్యుత్ కల్పించాలని కోరుతూ ఆప్ నేతలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు సమర్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆప్ నేత గోపాల్ ఇటాలియా మాట్లాడుతూ.. దేశంలో నేడు ఢిల్లీ, పంజాబ్‌లో మాత్రమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాయనీ, మరీ గుజరాత్ ప్రభుత్వం ఎందుకు ఉచిత విద్యుత్‌ను అందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం నివాసితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తుండగా, పంజాబ్ ప్రభుత్వం 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించాలని యోచిస్తోందని తెలిపారు. విద్యుత్తు పేరుతో గుజరాత్ ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తోందనీ, విద్యుత్ సంస్థలతో కుమ్మక్కై ప్రజలను దోచుకోవడానికి బిజెపి నడుపుతున్న రాకెట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఛేదిస్తుందని గోపాల్ ఇటాలియా పేర్కొన్నారు.