
ఆమ్ ఆద్మీ పార్టీ తన పరిధిని విస్తరించుకోవాలని చూస్తోంది. పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే ఢిల్లీ గద్దెనెక్కిన పార్టీ.. వరుసగా మూడు సార్లు అధికారం చేపట్టింది. ఇటీవల పంజాబ్ లో కూడా ఆ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో అక్కడ కూడా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఊపులో మిగితా రాష్ట్రాల్లోనూ పాగా వేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బుధవారం కర్ణాటకకు చేరుకున్నారు. 2023లో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ పార్టీ రాష్ట్ర యూనిట్ నేతలతో కూడా సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేడు బెంగళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్‌లో రైతులు, మహిళలు, యువకుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఇతర పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. కాగా ఈ పార్టీ ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే దక్షిణ రాష్ట్రాలోలనూ తన ఉనికిని చాటాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాధిలో పార్టీని నిలబెట్టాని కేజ్రీవాల్ ప్రయత్నించారు. కానీ అక్కడ ఆప్ తన ప్రభావం చూపలేదు. అధికార బీజేపీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
గోవాతో పాటు ఉత్తర భారతదేశంలో జరిగిన మరో 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే ఒక్క పంజాబ్ లో తప్ప ఆ పార్టీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లో గెలుపు కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారు. దీని కోసం ఆయా రాష్ట్రాలను పలు మార్లు సందర్శించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఢిల్లీని ఆనుకొని ఉన్న పంజాబ్ లో మాత్రం ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీని సాధించి అధికార కాంగ్రెస్ ను తుంగలో తొక్కింది. అక్కడ ఆ పార్టీ నాయకుడు భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఇటీవల అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ గుజారాత్ లోని అహ్మదాబాద్ లో, హిమాచల్ ప్రదేశ్ లో ర్యాలీ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఢిల్లీలో చేసినట్టే అభివృద్ధి చేసి చూపిస్తామని అక్కడి ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీలకు గతంలో పలు సార్లు అవకాశం ఇచ్చారని, ఈ సారి ఆప్ కు ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చెపుతామని అన్నారు.