అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావడంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో కలిసి రామ మందిరానికి వెళ్లుతానని స్పష్టం చేశారు.
Arvind Kejriwal: ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు హాజరవుతున్నారు. అయితే, ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు మాత్రం అయోధ్య ఆహ్వానాన్ని నిరాకరించాయి. 22వ తేదీన అయోధ్యలో జరిగే కార్యక్రమానికి రాబోమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే 22వ తేదీన అయోధ్యకు వెళ్లడంపై ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా తన ప్లాన్స్ వివరించారు.
జనవరి 22వ తేదీన తాను అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాబోనని, తనకు ఆహ్వానం అందలేదని కేజ్రీవాల్ వివరించారు. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత భార్య, పిల్లలు, తన తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రామ మందిరానికి వెళ్లుతానని చెప్పారు.
గతవారం తనకు ఓ లేఖ వచ్చిందని, జనవరి 22వ తేదీని బ్లాక్ చేసుకోవాలని, వేరే ఏ కార్యక్రమాలు పెట్టుకోరాదని అందులో కోరారని కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం ఆయనకు వస్తున్నదని, అంతలోపు ఆ తేదీని మరో కార్యకలాపానికి కేటాయించరాదని లేఖలో విజ్ఞప్తి చేశారని వివరించారు. ఆ కార్యక్రమం సెక్యూరిటీ, వీఐపీల కదలికల దృష్ట్యా ఒకరే రావాల్సి ఉంటుందనీ లేఖలో వివరించారని తెలిపారు. కానీ, ఇప్పటి వరకు ఆ ఆహ్వానం కూడా తనకు అందలేదని పేర్కొన్నారు.
Also Read : Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్ .. రేపటి నుంచి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు: మంత్రి తుమ్మల వెల్లడి
కానీ, అయోధ్య రామ మందిరానికి వెళ్లాలని తన తల్లిదండ్రులు చాలా ఆతృతతో ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాబట్టి, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి అయోధ్య రామ మందిరానికి వెళ్లుతానని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో సతీ సమేతంగా పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత మీడియాకు ఈ మేరకు తెలియజేశారు.