
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రేతర గిరిజన తెగలకు చెందినవారికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై అరుణాచల్ ప్రదేశ్ అట్టుడుకుతోంది. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మరణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సివిల్ సెక్రటేరియట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వ్యక్తి మరణించాడు.
ఈ స్థితిలో ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి చోవనా మెయిన్ కు చెందిన ఈటా నగర్‌లోని నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో చోవనా ఈటా నగర్ నుంచి నమ్‌సాయ్ జిల్లాకు వెళ్ళిపోయారు.
కోపోద్రిక్తులైన నిరసనకారులు జిల్లా కమిషనర్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో పోలీసు అత్యున్నత స్థాయి అధికారి ఒకరు గాయపడ్డారు. స్థానికేతరులైన రెండు గిరిజన తెగలకు చెందినవారు అరుణాచల్ ప్రదేశ్‌లో దశాబ్దాల నుంచి నివసిస్తున్నారు. వీరికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇచ్చేందుకు కల అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
ఈ కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈటా నగర్‌లో శుక్రవారం సాయంత్రం దాదాపు 50 కార్లను తగులబెట్టారు, దాదాపు 100 వాహనాలను ధ్వంసం చేశారు. 5 సినిమా థియేటర్లకు నిప్పు పెట్టారు. దీంతో ప్రభుత్వం సైన్యాన్ని పిలిచింది. ఈటా నగర్‌లో సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఈటా నగర్‌లో ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేశారు, కర్ఫ్యూ విధించారు.
ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నమసాయ్, చాంగ్‌లాంగ్ జిల్లాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నవారికి శాశ్వత నివాస ధ్రువపత్రాల మంజూరుకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయబోమని ప్రకటించింది.