
Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యుగాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఏఐ, ఆటోమేషన్ వంటి అధునాతన సాంకేతికత మానవ పురోభివృద్ధిని మరోమెట్టుకు ఎక్కిస్తున్నాయి. మనిషి చేయగలిగే పనులను ఏఐతో పని చేసే రొబాట్లు చక్కగా చేస్తున్నాయి. వీటి సామర్థ్యం మనుషులను అబ్బురపరుస్తున్నాయి. తాజాగా, ఇలాంటి ఓ డెవలప్‌మెంట్ ఒడిశా నుంచి వచ్చింది. ఒడిశాలో తొట్టతొలి టెలివిజన్ చానెల్ ఒడిశా టీవీ తొలిసారిగా ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషయల్ యాంకర్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాంకర్ వార్తలను చకచకా చదివేయనుంది.
ఒడిశా టీవీ ప్రారంభించి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏఐ యాంకర్‌ను ప్రవేశపెట్టారు. ఈ కృత్రిమ మేధ వ్యాఖ్యత పేరు లీసా. ఆమె తొలి టాస్క్‌లో తనను తాను పరిచయం చేసుకుంది.
ఆమె గడగడా ఇంగ్లీష్‌లో తన గురించి, చానెల్ గురించి మాట్లాడుతూ ఉంటే అందరూ నివ్వెరపోయారు. నిజంగా ఒక మనిషి, ఒక మహిళ మాట్లాడుతున్నారనే సంభ్రమలోకి వెళ్లిపోయారు.
టీవీ తెరపై ఏఐ యాంకర్ ప్రత్యక్షమై రెండు దశాబ్దాల క్రితం ఒడిశా ఏర్పడిన తర్వాత తొలిగా ప్రారంభమైన ఒడిశా టీవీ చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆ బొమ్మ యాంకర్ చెప్పింది. ప్రాంతీయ టీవీ చానెళ్లలో ఏఐ యాంకర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని, ఆ ఘటన ఓటీవీకి దక్కుతుందని వివరించింది.
లీసా బహు భాషాల్లో ప్రావీణ్యం సంపాదించే సామర్థ్యం ఉన్నది. అయితే, ఇప్పుడు ఇంగ్లీష్, ఒడియాపైనే దృష్టి పెట్టింది. లీసా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికల్లోనూ ఉన్నది.
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ వాయిదా
లీసా సమర్థవంగా వార్తలు వినిపించగలదని ఓటీవీ ఎండీ జాగి మంగత్ పాండ తెలిపారు. అయితే, కొంత సరళత ఇంకా రావాల్సి ఉన్నదని, త్వరలోనే ఈ ఏఐ యాంకర్ సరళంగా మాట్లాడగలుగుతుందని వివరించారు. గూగుల్ కూడా ఒడియా భాషను ఇంగ్లీష్‌లోకి సరిగా అనువదించలేదని చెప్పారు. కానీ, తమ ఏఐ యాంకర్ చాలా వరకు గూగుల్ కంటే కూడా మెరుగ్గా ఉన్నదని తెలిపారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ కంటే కూడా తమ ఏఐ యాంకర్ చాలా మెరుగ్గా ఉన్నదని వివరించారు.
అయితే, ఇలాంటి డెవలప్‌మెంట్‌లు చాలా రంగాల్లోని ఉపాధిని దెబ్బతీయడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిరోధక దృక్పథం నుంచి కాకుండా.. అధునాతన సాంకేతికతతో వచ్చే పెనుసవాళ్లను చర్చించి, మానవాళికి నష్టం చేకూరకుండా ఉండే నిర్ణయాలను తీసుకోవడం మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి.