
త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా (Chairman of the Chiefs of Staff Committee) ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (General MM Naravane) నియమితులయ్యారు. త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణే ఈ బాధ్యతలు స్వీకరించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సీడీఎస్ పదవి సృష్టించకముందు త్రివిధ దళాల్లోకెల్లా సీనియర్ అయిన అధికారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించేవారు. 2019లో భారత తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్‌ను ప్రధాని మోదీ ఎంపిక చేశారు. అయితే ఇటీవల జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించారు. ఈ క్రమంలోనే సీడీఎస్ పదవి ఖాళీ అయింది. అయితే ఆ పదవికి ఇంకా పేరును ఖరారు చేయలేదు.
అయితే ఈ నేపథ్యంలో సీడీఎస్‌కు ముందు పాద పద్దతిని ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు. త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్‌గా ఉన్న వ్యక్తిని చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా నిమమించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న నరవణే.. మూడు దళాల అధిపతుల్లో సీనియర్‌గా ఉండటంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఇక, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ ఏడాది సెప్టెంబర్ 30న, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఈ ఏడాది నవంబర్ 30 తేదీల్లో తమ పదవులను చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే సీడీఎస్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవులు వేర్వేరు. కొత్త సీడీఎస్‌ను నియమించే వరకు ఇది అవసరాల దృష్ట్యా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘CDS లేనప్పుడు, అత్యంత సీనియర్ చీఫ్ చైర్మన్.. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా బాధ్యతలు చేపట్టడం ఒక విధానపరమైన ప్రక్రియ’ అని ఒక అధికారి తెలిపారు.
ఇక, సీడీఎస్ (chief of defence staff).. కొత్తగా సృష్టించబడిన మిలిటరీ వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహించడంతో పాటుగా, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులు తమ తమ బలగాల కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తుండగా.. సీడీఎస్‌కు త్రివిధదళాల అడ్మినిస్ట్రేటివ్ సమస్యలపై అధికారాలు ఉంటాయి. ఉమ్మడి నిర్వహణలో ముఖ్యమైన భాగమైన ట్రై సర్వీస్ శిక్షణ.. CDS కార్యాలయం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉంది.
డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులోని కున్నూరు సమీపంలో చోటుచేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat), ఆయన సతీమణి మధులికా రావత్‌తో సహా సహా 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అతని పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే బెంగళూరు ఆర్మీ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూశారు.