జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విషయంలో వారణాసి కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయ సర్వే నివేదికను హిందూ, ముస్లిం పక్షాలకు అందుబాటులో ఉంచాలని అలహాబాద్ కోర్టు ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఎఎస్ఐ నివేదికను గత ఏడాది డిసెంబర్ 18న వారణాసి జిల్లా కోర్టు సీల్డ్ కవర్లో అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికను ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించారు.
హిందూ దేవాలయ నిర్మాణంపై మసీదు నిర్మించారా లేదా అని నిర్ధారించేందుకు ఎఎస్ఐ సర్వే నిర్వహించారు.కాశీ విశ్వనాథ్ ఆలయానికి పక్కనే జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఇరువర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని వారణాసి జిల్లా కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు ఆమోదించిన తర్వాత ఈ సర్వే ప్రారంభించారు.
ఈ ఉత్తర్వులపై జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఏఎస్ఐ సర్వేపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసేందుకు గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు నిరాకరించింది.
జ్ఞానవాపి మసీదు సముదాయంలో 17వ శతాబ్దపు మసీదు ముందుగా ఉన్న హిందూ దేవాలయంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి సర్వేను ప్రారంభించారు.అలహాబాద్ హైకోర్టు సర్వేకు అనుమతిని ఇచ్చిన తర్వాత ఎఎస్ఐ బృందం డాక్యుమెంట్ చేసి ఫోటో తీసి నిర్మాణాన్ని దెబ్బతీయకుండా వివరాలను రికార్డు చేసింది.
ఈ సర్వేను అంజుమాన్ ఇంతేజామియా మసీదు కమిటీ సవాల్ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఎటువంటి తవ్వకాలు లేకుండా ,ఎటువంటి నష్టం జరగకుండా సర్వే నిర్వహిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సర్వేపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.