
న్యూఢిల్లీ: కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్ వివాదం (Hyndai Controversy) సద్దుమణగడం లేదు. తాజాగా ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. పాకిస్తాన్ హ్యుందాయ్ ట్విట్టర్ అకౌంట్ చేసిన ట్వీట్ మూలంగా భారత్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నిరసనల నేపథ్యంలో హ్యుందాయ్ కంపెనీ ఓ వివరణ ఇచ్చింది. ఈ వివరణతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని ఆ కంపెనీ ఆశించింది. కానీ, ఆ వివరణలో స్పష్టంగా సారీ (Sorry) అనో.. అపాలజీ అనో ఎక్కడా పేర్కొనలేదు. కనీసం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసే పదాలూ లేవు. దీంతో ఆ వివరణ(Explanation)కు అర్థమే లేకుండా పోయింది. ఫలితంగా కొంత మంది యూజర్లు, నేతలు మళ్లీ భగ్గుమంటున్నారు.
శివసేన నేత ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియాలో హ్యుందాయ్ వివరణపై ట్వీట్ చేశారు. ‘హాయ్ హ్యుందాయ్.. మాకు మీ కల్లిబొల్లి పదాలు అన్నీ అవసరం లేదు. స్పష్టంగా క్షమాపణలు చెబితే చాలు. మిగతా ఇంకేమీ అక్కర్లేదు’ అంటూ రాసుకొచ్చారు. బీజేపీ నేత డాక్టర్ విజయ్ చౌథాయివాలే కూడా హ్యుందాయ్ వివరణపై అభ్యంతరం తెలిపారు. హ్యుందాయ్ ఇండియా.. ఇది సరిపోదు. పాకిస్తాన్ హ్యుందాయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మీరు సమర్థిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. అలాంటి భారత్ వ్యతిరేక వ్యాఖ్యానాలపై మీ అంతర్జాతీయ వైఖరి ఏమిటి? అంటూ అడిగారు.
పాకిస్తాన్‌లో ప్రతి యేటా ఫిబ్రవరి 5వ తేదీన కశ్మీర్ కోసం పోరాడి మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ పాకిస్తాన్ సంఘీభావ దినాన్ని జరుపుకుంటారు. కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తు చేసుకుందామని, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారికి మద్దతుగా నిలబడదామంటూ అదే రోజున హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. కశ్మీర్ కోసం పాకిస్తాన్ పౌరులు చేసేది త్యాగాలైతే.. మరి భారతీయులు చేసేదేమిటీ అంటూ సోషల్ మీడియాలో భారత యూజర్లు మండిపడ్డారు. దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇండియా హ్యుందాయ్ ఓ వివరణను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘మేం భారత మార్కెట్‌కు గత 25 ఏళ్లుగా కట్టుబడి ఉన్నాం. జాతీయ వాదాన్ని గౌరవించే తమ సంస్కృతిని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాం. ఈ దేశానికి మేం అందించిన అసమాన సేవలను ఆయాచితమైన ఓ సోషల్ మీడియా పోస్టును హ్యుందాయ్ మోటార్ ఇండియా అకౌంట్‌తో లింక్ చేసి గాయపరుస్తున్నారు. హ్యుందాయ్ బ్రాండ్లకు ఇండియా మరో పుట్టిల్లు. ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు, దృక్పథాలను మేం ఎట్టిపరిస్థితుల్లో సమర్థించబోం. భారత్ అభివృద్ధికి, ఈ దేశ పౌరుల ఉన్నతికి ఎప్పట్లాగే మా కృషి ఉంటుంది’ అని ట్వీట్ చేసింది.