ISRO : చంద్రుడిపై మరో ప్రయోగం చేయడానికి ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రయాన్ - 3 కొనసాగింపుగా చంద్రయాన్ -4 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగం చేపట్టేందుకు మరో ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంది.
Chandrayaan-4: చంద్రయాన్-3 విజయవంతమైంది. దీంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ఖ్యాతిని మరింత పెంచుకుంది. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి ప్రపంచానికి భారత్ శక్తిని ఇస్రో చాటి చెప్పింది. అయితే ఇదే ఊపులో ఇస్రో మరో సారి చంద్రుడిపై మరో ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్-4 కోసం ఇస్రో పని చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ స్వయంగా వెల్లడించారు.
పుణెలో శుక్రవారం జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటియోరాలజీ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. మరో సారి చంద్రుడి ధ్రువ అన్వేషణ మిషన్‌పై పని చేయబోతున్నామని చెప్పారు. గత చంద్రయాన్ 3 రోవర్ కంటే చంద్రయాన్ 4 మిషన్ లోని రోవర్ చాలా పెద్దగా ఉంటుందని ఆయన తెలిపారు.
india vs australia : వరల్డ్ కప్ ఫైనల్ ను ఆపేస్తాం - ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక..
‘‘చంద్రయాన్-3తో 70 డిగ్రీలకు చేరుకున్నాం. లూపెక్స్ మిషన్‌లో చంద్రుని చీకటి కోణాన్ని పరిశీలించేందుకు 90 డిగ్రీలకు వెళ్లి 350 కిలోగ్రాముల బరువున్న భారీ రోవర్‌ను అక్కడకు దింపుతాం. చంద్రయాన్-3 రోవర్ కేవలం 30 కిలోలు ఉంది. అయితే తాజా మిషన్ లో రోవర్ బరువు ఎక్కువగా ఉండనుంది కాబట్టి.. ల్యాండర్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. దీనినే లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ అంటారు. ఈ మిషన్ చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను తిరిగి తీసుకురావచ్చు’’ అని నీలేష్ దేశాయ్ పేర్కొన్నారు.