Uttarakhand tunnel collapse: ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రెస్క్యూ సిబ్బంది అవసరమైన సామాగ్రిని దూర ప్రాంతాల నుంచి తరలించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూనుకుంది. భారీ యంత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి డెహ్రాడూన్ కు తీసుకొస్తోంది.
Uttarakhand tunnel collapse: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సిల్కియారా టన్నెల్ కుప్పకూలి ఇప్పటికే ఆరు రోజులు దాటింది. గత ఆదివారం ఈ ఘటన జరగ్గా.. అప్పటి నుంచి టన్నెల్ లో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ చర్యలు ఏడు రోజుకు ప్రవేశించాయి. ఆరు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నా.. ఇప్పటి వరకు కార్మికులను భయటకు తీసుకురాలేకపోయారు.
అయితే ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకోవడానికి ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోపడే భారీ పరకరాలను ఘటనా స్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ తన భుజాలపైన వేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి దాదాపు 22 టన్నుల కీలకమైన పరికరాలను ఉత్తరాఖండ్ కు తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ -17 రవాణా విమానం సహాయపడనుంది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి మరో హై పెర్ఫార్మెన్స్ డ్రిల్లింగ్ యంత్రం ఇప్పటికే డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే అది రోడ్డు మార్గం ద్వారా సిల్కియారాకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. అక్కడ ఆ యంత్రాన్ని అన్ లోడ్ చేసిన తరువాత డ్రిల్లింగ్ ఉపయోగించనున్నారు.
ఉత్తరాఖండ్ లోని ధారసు వద్ద కొనసాగుతున్న టన్నెల్ రెస్క్యూకు సహాయం చేయడానికి ఐఏఎఫ్ కార్యకలాపాలు సాగిస్తోందని ఆ సంస్థకు చెందిన ‘ఎక్స్’ హ్యాండిల్ పోస్టు చేసింది. ‘‘ ఇండోర్ నుంచి డెహ్రాడూన్ కు దాదాపు 22 మెట్రిక్ టన్నుల కీలక సామగ్రిని తరలించేందుకు ఐఏఎఫ్ సీ-17ను ఉపయోగిస్తున్నాం’’ అని ఐఏఎఫ్ 'ఎక్స్'లో పోస్టు పెట్టింది.
ఇదిలా ఉండగా కుప్పకూలిన టన్నెల్ చిక్కుకున్న కార్మికులకు పైపు ద్వారా ఆహారం, ఆక్సిజన్, నీటిని సరఫరా చేస్తున్నారు. వారితో అధికారులు వాకీటాకీల ద్వారా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కాగా.. టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారని ‘డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్’ తెలిపిందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తెలిపింది.