మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో మరో వైద్యుడు కరోనా వైరస్ తో మరణించాడు.దీంతో మధ్యప్రదేశ్ లోనే కాకుిండా భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధితో రెండో వైద్యుడు మరణించాడు.
ఇండోర్: కరోనా వైరస్ సోకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో మరో వైద్యుడు మరణించాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కోవిడ్ -19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. అరవై ఐదేళ్ల ప్రైవేట్ ఆయుష్ ప్రాక్టిషనర్ ఓమ్ ప్రకాశ్ చౌహన్ తాజాగా మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
కరోనా వైరస్ కు బలైన రెండో డాక్టర్ ఇతను. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కరోనా వైరస్ కారణంగా మరణించిన రెండో డాక్టర్ అతను. ఇండోర్ లో గురువారంనాడు 62 ఏళ్ల శుత్రుఘ్న పంజ్వానీ అనే మెడికల్ ప్రాక్టిషనర్ మరణించాడు.
ప్రభుత్వోద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత చౌహాన్ ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగిస్తూ వస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్చారు.
అతను ఎక్కడికీ ప్రయాణించలేదని, అయితే రోగులకు చికిత్స చేసే క్రమంలో అతనికి వ్యాధి సోకి ఉంటుందని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ ప్రవీన్ జాడియా చెప్పారు
చౌహాన్ మృతితో శుక్రవారంనాడు ఇండోర్ లో కోవిడ్ -19తో మరణించినవారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇండోర్ లో 27 మరణాలు సంభవించాయి. అత్యధిక మరణాలు సంభవించిన రెండో నగరం ఇదే. మహారాష్ట్రలోని ముంబైలో అత్యధికంగా 45 మరణాలు సంభవించాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 37కు చేరుకుంది. అత్యధిక మరణాలు సంభవించిన రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. 97 మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.
ఇదిలావుంటే, భోపాల్ లో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో భోపాల్ లో కరోనా పాజిటివ్ సోకిన డాక్టర్ల సంఖ్య మూడుకు చేరుకుంది.