గత 24 గంటల్లో వేయికి పైగా భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. దాంతో దేశంలో 7 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 40 మరణాలు సంభవించాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో గత 24 గంటల్లో వేయికి పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కొత్తగా 40 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం 7,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 239 మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ లో ఆ వివరాలను అందించింది.
దేశంలో లక్ష ఐసోలేషన్ బెడ్డ్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 171717 శాంపిల్స్ ను పరీక్షించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఒక్క రోజే 16500 మందిని పరీక్షించిట్లు ఆయన తెలిపారు. దేశంలో 536 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, లాక్ డౌన్ పొడగింపుపై శనివారం సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒడిశా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మే 1వ తేదీ వరకు పొడిగించాయి.
లాక్ డౌన్ ను పొడగించాలనే ప్రధాని నిర్ణయం సరైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశం పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. అది లాక్ డౌన్ వల్లనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ను ఇప్పుడు ఎత్తేస్తే సాధించిన ఫలితాలు అందకుండా పోతాయని ఆయన అన్నారు. పరిస్థితిని మరింత మెరుగు పరచడానికి లాక్ డౌన్ ను కొనసాగించాలని ఆయన అన్నారు.