Zika Virus: కలకలం రేపుతున్న జికా వైరస్.. కొత్తగా మరో 30 కేసులు

By telugu teamFirst Published Nov 5, 2021, 1:41 PM IST
Highlights

కరోనా మహమ్మారి కాస్త వెనుకంజ పట్టిందో లేదో ఉత్తరప్రదేశ్ ప్రజలను మరో వైరస్ భయపెడుతున్నది. కాన్పూర్‌లో క్రమంగా జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కొత్తగా మరో 30 కేసులు రిపోర్టు అయినట్టు జిల్లా మెజిస్ట్రేట్ విశాక్ జీ అయ్యర్ వెల్లడించారు. దీంతో కాన్పూర్‌లో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 66కు పెరిగింది.
 

లక్నో: ఇప్పుడిప్పుడే Corona Virus నుంచి పరిస్థితులు కొంత స్తిమితపడుతున్నాయి. కానీ, Uttar Pradeshలో Zika Virus రూపంలో మరో పిడుగు పడినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా Kanpurలో ప్రజలు జికా వైరస్ ముప్పుతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ శాంపిల్స్ పంపిన ప్రతిసారీ పాజిటివ్ రిపోర్టులు రావడం కలకలం రేపుతున్నది. తాజాగా కొత్తగా మరో 30 కేసులు పాజిటివ్ అయినట్టు తేలింది. కాన్పూర్‌లో కొత్తగా మరో 30 కేసులు రిపోర్ట్ అయినట్టు జిల్లా మెజిస్ట్రేట్ విశాక్ జీ అయ్యర్ వెల్లడించారు.

కొత్త కేసులతో కాన్పూర్‌లో మొత్తం కేసుల సంఖ్య 66కు చేరింది. ఇందులో 45 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాన్పూర్‌లో తొలి కేసు గత నెల 23న నమోదైన సంగతి తెలిసిందే. వైమానిక దళాని(IAF)కి చెందిన వారంట్
అధికారికి జికా వైరస్ సోకింది. ఈ కేసే తొలి కేసుగా కాన్పూర్‌లో నమోదైంది. తర్వాతి పది రోజుల్లోనే 11 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐఏఎఫ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ఈ ఏరియాలో నుంచి పలువురు అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ల్యాబ్‌కు పంపారు. ఇందులో కొత్తగా మరో 30 మందికి జికా వైరస్ పాజిటివ్ అని వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

Also Read: కాన్పూర్‌లో కొత్తగా మరో 25 జికా వైరస్ కేసులు.. అధికారులు అప్రమత్తం.. రెండో రౌండ్ స్క్రీనింగ్ ప్రారంభం

జికా వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి, దోమల నియంత్రణపై అధికారులు ఫోకస్ పెట్టారు. లార్వాను చంపే పద్ధతులను అమలు జరుపుతున్నారు. యాంటీ లార్వా పిచికారీ చేపడుతున్నారు. ఆరోగ్య అధికారులు శానిటైజేషన్ చేపడుతున్నారు. జ్వర పీడితులను పరిశీలిస్తున్నారు. తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిఘాను పటిష్టం చేశారు. డోర్ టు డోర్ తనిఖీలు చేస్తున్నారు. శాంపిల్స్ తీసుకుంటున్నారు.

ఆకస్మికంగా జికా వైరస్ పెరుగుదలపైనా ఆందోళన చెందవద్దని అధికారులు ప్రజలకు భరోసానిస్తున్నారు. కట్టడి చర్యలు తీసుకుంటున్నామని, భయపడవద్దని చెబుతున్నారు. ఐఏఎఫ్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హై అలర్ట్‌ను ప్రకటించినట్టు మరో అధికారి వెల్లడించారు.

జికా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇప్పటికే ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పటిష్ట నిఘా పెట్టాలని, తరుచూ డోర్ టు డోర్ శానిటైజేషన్ చేపట్టాలని సూచించారు. దోమలు లార్వాను ఏర్పాటు చేయకుండా ఫాగింగ్ చేయాలని సూచనలు చేశారు.

Also Read: దేశంలో జికా వైరస్ కలకలం.. దాని లక్షణాలు ఇవే..!

అయితే, ఇప్పటి వరకు ఈ వైరస్ సోర్స్ ఆచూకీ లభించలేదు. వైరస్ ఎక్కడ మొదలైందనే విషయంపై ఆందోళన ఉన్నది. ఎక్కడి నుంచి వైరస్ వ్యాపించిందనే విషయాన్ని కనుగొనడానికి కంటోన్‌మెంట్ ఏరియా ప్రజలను పరీక్షిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ వివరించారు. 

ఇందుకోసం తొలి రౌండ్‌లో 45వేల ప్రజలను స్క్రీనింగ్ చేశారు. కానీ, జికా వైరస్ సోర్స్‌ను కనిపెట్టలేకపోయారు. తాజాగా, గురువారం నుంచి రెండో దఫా Screening Testలను ప్రారంభించారు.

జికా వైరస్‌ ఉత్తరప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రలో నమోదైంది.

click me!