ఇది వివక్షే.. ఏపీ హైకోర్టు జడ్జీల బదిలీని నిరసిస్తూ లాయర్ల విధుల బహిష్కరణ.. ఆందోళనలు

By Mahesh KFirst Published Nov 25, 2022, 5:54 PM IST
Highlights

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదులు ఆందోళనలకు దిగారు. ఇది వివక్షకు సంకేతంగా ఉన్నదని ఆరోపించారు. ఈ బదిలీల్లో రాజకీయం జోక్యం ఉన్నదని పేర్కొన్నారు. అందుకే విధులు బహిష్కరించి ఆందోళనలకు దిగినట్టు చెప్పారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ లాయర్లు విధుల బహిష్కరణ చేశారు. హైకోర్టు ఎదుటే ఆందోళనకు దిగారు. ఏపీ హైకోర్టు జడ్జీల బదిలీలు వివక్షకు సంకేతం అని వివరించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ట్రాన్స్‌ఫర్‌ను వెనక్కి తీసుకున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ బదిలీల్లో రాజకీయ జోక్యం ఉన్నదని ఆరోపించారు. మూడు హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు నుంచి న్యాయమూర్తులు కన్నెగంటి లలిత, డాక్టర్ డీ నాగార్జున, ఏ అభిషేక్ రెడ్డిలను వరుసగా కర్ణాటక హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, పాట్నా హైకోర్టులకు బదిలీ చేసింది. ఏపీ హైకోర్టు నుంచి న్యాయమూర్తులు బట్టు దేవానంద్, డీ రమేష్‌లను వరుసా మద్రాస్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టులకు ట్రాన్స్‌ఫర్ చేసింది. కాగా, మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ వీఎం వేలుమణి, జస్టిస్ టీ రాజాలను కలకత్తా హైకోర్టు, రాజస్తాన్ హైకోర్టులకు వరుసగా బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు చర్చనీయాంశం అవుతున్నాయి. న్యాయవాదులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇటీవలే తెలంగాణ, మద్రాస్, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మూడు హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నూతన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సిఫార్సులు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు నుంచి ఇద్దరి చొప్పున జడ్జీలు, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఆందోళనలకు దిగారు.

Also Read: ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు.. తెలంగాణ నుంచి ముగ్గురు.. ఏపీ నుంచి ఇద్దరు బదిలీ

గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిని బదిలీని కొలీజియం ప్రస్తుతానికి నిలిపేసినట్టు తెలుస్తున్నది. గుజరాత్ జడ్జీ బదిలీపై అక్కడి న్యాయవాదులు ఆందోళనలు చేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్‌నూ కలిశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ హైకోర్టు జడ్జీ ట్రాన్స్‌ఫర్ నిలిపేసినట్టు సమాచారం.

click me!