
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో తరుచూ ఏదో ఓ కొత్త విషయంలో ఫాలోవర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. ఈ సారి ఓ యువకుడి వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ యువకుడు తలపై మోపిన మూటను రెండు చేతుల పట్టుకుని సైకిల్ తొక్కుతూ కనిపించారు. హ్యాండిల్ గాలికి వదిలేసినా సైకిల్‌ను వేగంగా తొక్కుతూ రోడ్డు మలుపుల్లోనూ సులువుగా సైకిల్‌ను తీసుకెళ్లారు. ఈ వీడియో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది. దీనిపై ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు.
ఆయన ఒక మానవ సెగ్‌వే (కదలకుండా నిలబడితే చాలా నిర్దేశిత చోటుకు తీసుకెళ్లే వాహనం లేదా పరికరం) అని ట్వీట్ చేశారు. ఆయన బాడీలో గైరోస్కోప్ ఇన్‌బిల్ట్‌గానే ఉన్నట్టుంది అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఇలాంటి ఆణిముత్యాలు మన దేశంలో, ఇంతటి ట్యాలెంట్ ఉన్నవారు ఎందరో ఉన్నారని, కానీ, చాలా వరకు వారు వెలుగులోకి రాకపోవడంపై బాధ కలుగుతుందని వివరించారు.
ఆ వీడియోలో యువకుడు ఎంతమాత్రం సంకోచం లేకుండా సన్నని రోడ్డుపై వేగంగా సైకిల్‌ను తొక్కుతూ వెళ్లారు. తన చేతులను తలపై మోపిన మూటకు అప్పజెప్పారు. హ్యాండిల్‌ను గాలికొదిలేశారు. అయినా.. ఆ బరువు మోస్తూ వేగంగా సైకిల్ తొక్కుతూ హ్యాండిల్‌ను తన అధీనంలోనే ఉంచుకోగలిగారు. ఆ వేగంతోనూ రోడ్డు మలుపుల్లోనూ ఎంత మేరకు మలగాలో ఆ మేరకు హ్యాండిల్‌ను ముట్టకుండానే తిప్పేలా చేసుకోగలిగారు. ఇవన్నీ చేసుకుంటూనే తన మొత్తం దృష్టి తలపై ఉన్న మూటపై ఉన్నది.
ఆ యువకుడు సైకిల్‌పై అలా వెళ్తుంటే వెనుక ఒక వాహనంలో ఉండి వీడియోను రికార్డ్ చేసినట్టు ఉన్నది. ఆ సైకిల్ మెయిన్ రోడ్డు వదిలి గ్రామంలోకి వెళ్లే పిల్ల బాట వైపు వెళ్లగానే వీడియో ముగిసింది.
ఆ యువకుడి నైపుణ్యంపై ట్విట్టర్ యూజర్లు ప్రశంసలు కురిపించారు. ఇలా చీకటిలోనే దాగి ఉండిన ఆణిముత్యాలను వెతికి వెలికి తేవాల్సిన అవసరం ఉన్నదని ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో తొలిగా పోస్టు చేసిన ట్విట్టర్ అకౌంట్ యూజర్ ప్రఫుల్ థాంక్యూ అన్నట్టుగా ఎమోజీ పెట్టారు.