సరిస్క టైగర్ రిజర్వ్‌లో భారీ మంటలు.. రంగంలోకి వైమానిక దళం

Published : Mar 29, 2022, 05:52 PM IST
సరిస్క టైగర్ రిజర్వ్‌లో భారీ మంటలు.. రంగంలోకి వైమానిక దళం

సారాంశం

రాజస్తాన్‌లోని సరిస్క టైగర్ రిజర్వ్‌లో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఈ మంటలు అంతకంతకు వ్యాపిస్తూ పోతున్నాయి. ప్రస్తుతం పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేరకు వ్యాపించి ఉన్నాయి. వీటిని ఆర్పడానికి జిల్లా యంత్రాంగంతోపాటు భారత వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.  

జైపూర్: రాజస్తాన్‌లోని సరిస్క టైగర్ రిజర్వ్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సుమారు పది చదరపు కిలో మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతాల్లో ఆకాశంలోకి దట్టమైన పొగ ఆవరించి ఉన్నది. నిన్న రాత్రి ఈ మంటలు మొదలైనట్టు తెలిసింది. ఈ రోజు ఉదయం నుంచి అగ్నిమాపక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల కోసం భారత వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ రెండు హెలికాప్టర్లు సమీపంలోని ఓ సరస్సు నుంచి నీటిని పెద్ద ట్యాంకు ఆకారంలా ఉన్న పరికరంతో మంటలు వ్యాపించి ఉన్న ప్రాంతాలపై చల్లుతున్నాయి. ఈ మంటలు ఇప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు.

ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్న ప్రాంతంలో ఎస్‌టీ-17 అనే పులి, దాని రెండు పిల్లలు తిరుగుతూ ఉంటాయి. ఈ భారీ మంటల వల్ల వెలువడుతున్న దట్టమైన పొగ చేత ఆ పులులు ఊపిరాడక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, మంటలు ఇంకా అదుపులోకి రాకపోవంతో సమీపంలోని గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు.

సరిస్క టైగర్ రిజర్వ్‌లో మంటలను అదుపులోకి తేవడానికి అల్వార్ జిల్లా అధికారులతోపా టు భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్టు ఐఏఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అల్వార్ జిల్లా అధికారులు సహాయం కోరగానే వెంటనే ఈ హెలికాప్టర్లు అక్కడకు వెళ్లాయని వివరించింది. ఈ రెండు హెలికాప్టర్లు బాంబి బకెట్ ఆపరేషన్స్ చేపడుతున్నాయని తెలిపింది. సరిస్క టైగర్ రిజర్వ్‌కు 43 కిలోమీటర్ల దూరంలోని సిలిసేడ్ సరస్సులోని నీటిని హెలికాప్టర్లు ఆ భారీ బకెట్‌లోకి తీసుకుని వస్తున్నాయి. టైగర్ రిజర్వ్‌లో మంటలు మండుతున్న ప్రాంతాల మీద గుమ్మరిస్తున్నాయి.

అరావళి కనుమల్లో భాగంగా ఉన్న ఈ టైగర్ రిజర్వ్ చిరుత పులులు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, హైనాలు, జాక్కాల్స్ వంటి ఇతర అనేక జంతువులకు ఆవాసంగా ఉన్నది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి భారత ప్రభుత్వం పులుల సంఖ్యను గణిస్తూ ఉంటుంది. ప్రపంచంలో మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం మన ఇండియాలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే