జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు, రాష్ట్రహోదాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

By telugu team  |  First Published Oct 23, 2021, 9:42 PM IST

జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర హోదా కల్పించడం, ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడారు. వీటన్నింటికి ముందు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని స్పష్టం చేశారు. దాన్ని అడ్డుకునేదే లేదని వివరించారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని తెలిపారు.


శ్రీనగర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన జమ్ము కశ్మీర్ చేరుకున్నారు. అనంతరం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఓ పోలీసు అధికారి  కుటుంబాన్ని పరామర్శించారు. జమ్ము కశ్మీర్‌లో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదంపై భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్రహోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణం 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ లేదా లోక్ సభ నియోజకవర్గాలకు సరిహద్దులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టాలని యోచించింది. ఇందుకోసం సంబంధిత అధికారులకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ, జమ్ము కశ్మీర్‌లోని పార్టీలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. ముందు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నాయి. తాజాగా, అమిత్ షా ఈ అంశంపై మాట్లాడారు.

Latest Videos

Also Read: కశ్మీర్‌లో ఉగ్రవాదం.. పౌర హత్యలపై సమాధానమివ్వండి.. అమిత్ షా భేటీలో వీటిపైనే చర్చ

డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు ఆపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడిగారు. దీన్ని ఎవరూ ఆపడం లేదని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని ఓ యూత్ క్లబ్ సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

జమ్ము కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించడం, ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయని, వారందరికీ తాను సమాధానమిస్తామని చెప్పారు. 70ఏళ్లుగా ఇక్కడ మూడు కుటుంబాలు పాలించాయని, అప్పుడు 40వేల కశ్మీరీలు హతమవ్వకుండా ఎందుకు కాపాడుకోలేకపోయాయని అడిగారు. 370 ఆర్టికల్ నిర్వీర్యం చేసేటప్పుడు కొందరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఒకవేళ తాము కర్ఫ్యూ విధించకుంటే ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను పట్టుకుని ఏడ్వాల్సి వచ్చేదని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం కశ్మీర్ అంటే ఉగ్రవాదమని, ఇప్పుడు అభివృద్ధి సరికొత్త రూపమని పేర్కొన్నారు.

click me!