అస్సాం సీఎం పగ్గాలు అమిత్ షా చేతిలో.. హిమంత శర్మ అత్యంత అవినీతిపరుడు - రాహుల్ గాంధీ

By Sairam IndurFirst Published Jan 24, 2024, 12:50 PM IST
Highlights

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi).. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) పై విమర్శలు చేశారు. అస్సాం సీఎం పగ్గాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union home minister amith shah) చేతిలో ఉన్నాయని చెప్పారు. అమిత్ షాకు వ్యతిరేకంగా ఆయన ఏం మాట్లాడలేరని చెప్పారు.

అస్సాం సీఎం పగ్గాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతిలో ఉన్నాయని, హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. గౌహతిలో పోలీసులతో ఘర్షణకు దిగినందుకు ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు అయిన మరుసటి రోజు ఆయన ఈ ప్రకటన చేశారు. 

అస్సాంలోని బారాపేటలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్రలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం శర్మ దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని అన్నారు. సీఎం నియంత్రణ అమిత్ షాదే అని, అస్సాం సీఎం హోంమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా చెబితే పార్టీ నుంచి తరిమికొడతారని అన్నారు. బీజేపీ నాయకులు ఎన్నైనా కేసులు పెట్టాలని అన్నారు. దీని వల్ల వారికి ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. కానీ తాను భయపడబోనని తెలిపారు. తాను బీజేపీ లేదా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భయపడేది లేదని చెప్పారు.

Latest Videos

హిమంత బిస్వా శర్మ హృదయంలో ప్రపంచం మొత్తం మీద ద్వేషం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆయన హృదయం నుండి ద్వేషం బయటకు వస్తుందని చెప్పారు. ‘‘ మేము చేసే పోరాటం ఆయనతో కాదు.. ఆయన హృదయాల్లోని ద్వేషంతో.. ద్వేషం ద్వేషాన్ని ఎప్పటికీ కత్తిరించదు. ఎవరైనా మీతో తప్పుగా మాట్లాడితే, మీరు కూడా అలాగే బదులిస్తే ఇక అది అలానే కొనసాగుతుంది. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించుకోవచ్చు. ద్వేషం వెనుక భయం దాగి ఉంది. ఈ వ్యక్తులు దేశంలో భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు.’’ అని అన్నారు. 

భారత్ జోడో న్యాయ్ యాత్ర 11వ రోజు బుధవారం ఉదయం బార్పేటలో తిరిగి ప్రారంభమైంది. జనవరి 14న మణిపూర్ లోని తౌబాల్ నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించారు. అయితే ఈ యాత్రకు ప్రధాన మార్గాల గుండా గౌహతిలోకి ప్రవేశించడానికి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మంగళవారం రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా హింసాత్మక చర్యలు చేయడం, రెచ్చగొట్టడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై కాంగ్రెస్ సభ్యులు దాడి చేసినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.

click me!