Nagaland Firing: పొరపాటు జరిగింది.. ఉగ్రవాదులనే అనుమానంతోనే ఫైరింగ్.. లోక్‌సభలో అమిత్ షా

By Pratap Reddy KasulaFirst Published Dec 6, 2021, 3:33 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు పార్లమెంటులో నాగాలాండ్ ఆర్మీ కాల్పులపై వివరణ ఇచ్చారు. నాగాలాండ్‌లో సైనిక ఆపరేషన్‌లో 14 మంది పౌరులు మరణించడం బాధాకరమని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరులను ఉగ్రవాదులనే అనుమానంతో సైనికులు ఫైరింగ్ జరిపినట్టు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
 

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం Nagaland ఆర్మీ కాల్పుల(Army Firing) ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఈ రోజు లోక్‌సభలో(Loksabha) వివరణ ఇచ్చారు. పౌరుల(Civilians)పై ఆర్మీ కాల్పుల్లో 14 మంది మరణించిన ఘటనలపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ పౌరులను ఉగ్రవాదులనే అనుమానంతో ఆర్మీ ఫైరింగ్ జరిపిందని, పొరపాటు జరిగిందని వివరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూస్తామని వివరించారు. ఇప్పటికే ఈ కాల్పులతో ప్రభావితమైన జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయని, కానీ, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చస్తున్నదని తెలిపారు.

నాగాలాండ్‌లోని పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అయిందని కేంద్ర మంత్రి అమిత్ షా వివరించారు. దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఒక నెలలో దర్యాప్తు పూర్తి చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువరించినట్టు పేర్కొన్నారు. తనకు నాగాలాండ్ ఘటనపై సమాచారం అందగానే వెంటనే ఆ రాష్ట్ర గవర్నర్, సీఎంలతో మాట్లాడినట్టు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నదని చెప్పారు. నిన్న మొత్తం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిందని వివరించారు.

Also Read: Nagaland Firing: ఆర్మీ యూనిట్‌పై కేసు.. ‘హత్య చేయాలనే ఉద్దేశంతోనే..’ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు..

నాగాలాండ్ సరిహద్దు జిల్లా మోన్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు ఈ నెల 4వ తేదీన ఆర్మీకి సమాచారం అందిందని ఆయన పార్లమెంటులో తెలిపారు. ఆ సమాచారం ఆధారంగానే 21 మంది కమాండోలు అనుమానిత ప్రాంతంలో నిఘా వేసి ఉన్నారని చెప్పారు. అదే సమయంలో అక్కడికి ఓ వాహనం వచ్చిందని, దాన్ని ఆపాలని ఆర్మీ సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా వెళ్లడానికి ప్రయత్నించారని, దీనితో ఆర్మీలో అనుమానాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆ వాహనంలో ఉగ్రవాదులు పారిపోతున్నట్టు అనుమానించి కాల్పులు జరిపారని వివరించారు. ఈ ఘటనలో వాహనంలోని ఎనిమిది మందిలో ఆరుగురు మరణించారని, ఆ తర్వాత వారు ఉగ్రవాదులు కాదని ఆర్మీకి తెలిసిందని చెప్పారు. 

ఈ విషయం ప్రజలకు చేరగానే వారు ఆర్మీ యూనిట్‌పై దాడికి దిగారని, వారి రెండు వాహనాలకు నిప్పు పెట్టారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.  ఫలితంగా ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడని, ఈ క్రమంలోనే అక్కడి జవాన్లు ప్రాణ రక్షణలో భాగంగా మరోసారి కాల్పులు జరిపారని వివరించారు. దీంతో మరో ఏడుగురు పౌరులు మరణించారని తెలిపారు. మరికొందరు గాయాపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ కూడా పశ్చాత్తాపాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు.

Also Read: నాగాలాండ్‌లో దారుణం: ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు, 13 మంది పౌరులు మృతి, ఉద్రిక్తత

ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు క‌మిటీని (సిట్‌)ను ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.  అలాగే, భార‌త ఆర్మీ ఉన్న‌తాధికారులు సైతం దీనిపై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఘ‌ట‌న బాధ్యులైన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇదిలావుండ‌గా, పౌరుల‌పై కాల్పులు జ‌రిపిన  పారా స్పెష‌ల్ ఎలైట్ యూనిట్‌పై కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌ను సుమోటోగా స్వీక‌రించిన నాగాలాండ్ పోలీసులు.. పారా స్పెష‌ల్ ఎలైట్ యూనిట్ పై కేసు ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారు. ఈ క్ర‌మంలోనే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఉద్దేశపూర్వకంగానే కాల్పులకు పాల్పడినట్టు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపి పౌరుల ప్రాణాలు తీశార‌ని తెలిపారు. అనేక మందిని తీవ్రంగా  గాయపరిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో తమ సహాయం కోరలేదని, దీని గురించి తమకు ఎటువంటి సమాచారమూ అందించ‌లేద‌ని తెలిపారు.  కాగా, నాగాలాండ్‌లోని  మోన్‌ జిల్లాలో శ‌నివారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 14 మంది మ‌ర‌ణించారు.  కాల్పుల నేప‌థ్యంలో స్థానికులు తిర‌గ‌బ‌డ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. 

click me!