
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మూడో కూటమి ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కూటమి నిర్మాణం పూర్తయిపోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ కూడా ఈ కూటమిలో చేరే అవకాశం కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ లో విజయఢంకా మోగిన నాటి నుంచే..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ మళ్లీ విజయఢంకా మోగించింది. దీంతో మూడో సారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె దేశ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. దేశంలోని పలు పార్టీల నాయకులతో భేటీ అవుతున్నారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వని పార్టీ నాయకులను కలిసి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్‌సీపీ అధినేత శరాద్ పవర్‌తో ఇటీవల రెండు సార్లు భేటీ అయ్యారు. అనంతరం శివసేన అధినేత ఉద్దవ్ టాక్రేతో భేటీకి ప్రయత్నించారు. అయితే ఆయన అనారోగ్యంతో ఉండటంతో సమావేశం జరగలేదు. శివసేనకు చెందిన ఇతర ముఖ్యనాయలతో భేటీ అయి థర్డ్ ఫ్రంట్ విషయంలో చర్చించారు. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీ థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు తెలుపుతున్నట్టు ఎలాంటి ప్రకటన రాలేదు.
https://telugu.asianetnews.com/national/didi-steps-to-occupy-the-congress-seat--r3jfa8
థర్డ్ ఫ్రంట్‌కు అఖిలేష్ యాదవ్ మద్దతు..
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు ప్రకటించాడు. ఝాన్సీలో నిర్వహించిన యాత్రలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఏర్పాటు చేయబోయే కూటమిలో తాను చేరుతానని అన్నారు. దీది బెంగాల్‌లో బీజేపీని కనిపించకుండా చేశారని, యూపీ ప్రజలు కూడా అలాగే చేయాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీని గెలిపించాలని ఆ యాత్ర సందర్భంగా చెప్పారు.
థర్డ్ ఫ్రంట్‌లో టీఆర్ఎస్ చేరిక.. ?
మమతా బెనర్జీ ఏర్పాటు చేయబోయే ఈ మూడో కూటమిలో చేరడానికి టీఆర్ఎస్ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దొందు దొందేనని దేశంలో మూడో కూటమి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ వేధికపై ఎన్నో సార్లు చెప్పారు. అవసరమైతే తానే ఈ కూటమికి నాయకత్వం వహిస్తానని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా కొనసాగించారు. ఇప్పుడు మమతా బెనర్జీ భేటీ అయినట్టుగానే గతంలో సీఎం కేసీఆర్ కూడా పలు పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు. ఏమయ్యిందో ఏమో కానీ కొన్ని రోజులకే ఆ అంశంపై సీఎం కేసీఆర్ స్పందించడం మానేశారు. దీంతో ఆ అంశం మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తున్న చొరవతో ఆయన ఈ మూడో కూటమికి మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి.
వ్యూహకర్తగా పీకే.. ?
ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ ఈ మూడో కూటమికి సహకారం అందిచనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో మమతా బెనర్జీతో ఒప్పందాలు అయినట్టు సమాచారం. మొదటి సారి బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. అయితే ఆయన కొంత కాలం బీజేపీకి దూరంగా ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వెళ్లే ఆలోచన ఉన్నప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందుకు ఒప్పకోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో ఆయన ఈ మూడో కూటమికి ఐ ప్యాక్ సంస్థ ద్వారా సహకారం అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనే ఈ మూడో కూటమిలో టీఆర్ఎస్ ను చేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలను ఈ కూటమిలో చేర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.