Amit Shah:  కాంగ్రెస్ నిరసనకు అయోధ్య రామ‌మందిరంతో లింకు.. అమిత్ షా ఏం చెప్పారంటే..?

By Rajesh KFirst Published Aug 5, 2022, 9:32 PM IST
Highlights

Amit Shah: కాంగ్రెస్ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం లేదా నిరుద్యోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు నిరసనలు చేప‌ట్ట‌లేద‌నీ, ఈ రోజు రామజన్మభూమికి శంకుస్థాపన చేసినందుకు నిరసనగా.. వారు నల్ల బట్టలు ధరించార‌ని ఆరోపించారు. 

Amit Shah: ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్ర‌వారం నాడు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌నలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,  పలు నాయ‌కులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అయితే.. ఆగష్టు ఐదో తేదీనే కాంగ్రెస్ నిరసన చేపట్టడానికి అసలు కారణం వేరే ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఏ ఈడీని ప్రశ్నించలేదని, అలాంటప్పుడు నల్లబట్టలు ధరించి కాంగ్రెస్ ఎందుకు నిరసన తెలిపిందని నిల‌దీశారు. బాధ్యతాయుత పార్టీగా కాంగ్రెస్ చట్టానికి సహకరించాలని అన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. ఆగస్టు 5న రామమందిర శంకుస్థాపన జరిగిన రోజునే.. కాంగ్రెస్ గత రెండేళ్లుగా నిరసనలు చేస్తోందని ఆరోపించారు. నల్ల బట్టలు ధరించి నిరసన తెలపడమేంట‌నీ ప్ర‌శ్నించారు. బాధ్యతాయుతమైన పార్టీగా కాంగ్రెస్ చట్టానికి మద్దతివ్వాలని హోంమంత్రి అమిత్ షా అన్నారు. 

‘‘ఈ రోజే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రత్యేకంగా నిరసన చేపట్టింది? ఇదే రోజే ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు. కాబ‌ట్టి దానిని వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టింది. బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకే కాంగ్రెస్ నేడు నిరసన చేపట్టింది. ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల ద్వారా ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది ’ అని అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

కాంగ్రెస్ బుజ్జగింపు విధానాన్ని యథావిధిగా అనుసరిస్తోందని, కానీ ఈ విధానం దేశానికి సరైనది కాదనీ, దీని వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందనీ, ఆ పార్టీ ఓడిపోవ‌డానికి ప్రధాన కారణం కూడా బుజ్జగించడమేన‌ని విమ‌ర్శించారు.  అలాగే.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ప్రశ్నించడంపై అమిత్ షా  స్పందించారు. ప్రతి ఒక్కరూ ఈడీని గౌరవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం పని చేయాలి. శుక్రవారం ఏ కాంగ్రెస్ నాయకుడికి ఈడీ సమన్లు ​​పంపలేదని అన్నారు. ఇది క‌చ్చితంగా ప్రణాళికాబద్ధంగా చేసిన‌ నిరసననేని ఆయన నొక్కి చెప్పారు.

రామభక్తులను అవమానించడమే: యోగి 

కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈ మొత్తం ప్రదర్శన రామభక్తులను అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ యొక్క ఈ ప్రవర్తన పూర్తిగా ఖండించదగినదని అన్నారు. సీఎం యోగి కూడా షా అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అయోధ్య రామ‌మందిర శంఖుస్థాప‌నను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నల్ల బట్టలు ధరించి.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. 

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నిర‌స‌న‌ కార్య‌క్ర‌మాల్లో రాహుల్ గాంధీ నుండి ప్రియాంక గాంధీ వరకు అందరూ ఈ నిరసనలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతోపాటు, ప్రియాంకా గాంధీ, ఇతర నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత వారిని వదిలిపెట్టారు. పోలీసు కస్టడీలోకి వెళ్లినా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  కానీ, బీజేపీ నేత‌లు ఈ నిర‌స‌న‌ల‌కు రామ మందిర  ఆంశాన్ని జోడించింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ అంశంపై రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

click me!